కన్నీరు పెట్టిస్తున్న కుటుంబాల గాథలు

  • ఒక్కో కుటుంబ గాధ వింటే కన్నీళ్లు ఆగవు
  • తాండూరు ప్రాంతానికి చెందిన 13 మంది మృతి
  • తాండూరు మొదటి బస్సు మిగిల్చిన శోకం

తాండూరు, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన కంకర టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు (టీజీ 34 టీఏ 6354) ఢీ కొన్న రోడ్డు ప్రమాదం వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలోని పలువురు కుటుంబాలలో అంతులేని విషాదం మిగిలిచ్చింది. ఈ ప్రమాదంలో సుమారు 13 మంది దుర్మరణం చెందారు. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరి విషాద గాథ అందరిని కన్నీళ్లు పెట్టిస్తోంది.

ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఒకేసారి…

తాండూరు నియోజకవర్గం యాలాల మండలం పేర్కొంపల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్ చాలా ఏళ్ల క్రితం తాండూరు పట్టణానికి వలస వచ్చారు. ఆయనకు నలుగురు కూతుళ్లు. ఒక కుమారుడు ఉన్నారు. పట్టణంలోని వడ్డెర గల్లిలో ఉంటూ ఎల్లయ్య గౌడ్ ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తూ పిల్లలను చదివించారు.

ఇటివలే పెద్ద కూతురు అనూష వివాహము ఘనంగా జరిపించారు. రెండో కూతురు తనూష ఏంబీఏ చదువుతూ ఉద్యోగం చేస్తుంది. మూడో కూతురు సాయిప్రియ హైదరాబాద్లోని కోటి వుమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్. నాలుగో కూతురు నందిని అదే కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా.. కుమారుడు తాండూరు పట్టణంలోనే ఓ ప్రవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు.

గత నెల 15న జరిగిన పెద్ద కూతురు అనూష వివాహము కోసం వచ్చిన తనూష, సాయిప్రియ, నందినిలు సోమవారం పరీక్షలు ఉన్నాయని చెప్పి తాండూరు బస్టాంట్ నుంచి వెళ్లిన బస్సులో హైదరాబాద్ బయల్దేరారు. కుటుంబంతో కలిసి ఆనంద క్షణాలు గడిపిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఒకేసారి దుర్మరణం చెందారు. ఈ ఘటనలో కుటుంబంలో ఆనంద క్షణాలు ఆవిరి అయ్యాయి. అక్కా చెల్లెళ్ల అంత్యక్రియలను వారి స్వగ్రామం పేర్కంపల్లిలో నిర్వహించారు.

అత్తారింటికి వెళుతుండగా… తల్లీ.. చిన్నారి

తాండూరు పట్టణం ఇందిరానగర్ కు చెందిన ఖాలీద్ వెల్డర్ గా పనిచేస్తున్నారు. ఆయన కూతురు సలేహా(20)ను కొన్నేళ్ల క్రితం వాహిట్తో వివాహాము జరిగింది. వాళ్లు హైదరాబాద్ లోని సాహిన్ నగర్ లో ఉంటున్నారు. ఇటీవలే సలేహా కాన్పుకోసం వచ్చి పండంటి పాపకు జన్మనిచ్చింది.

అయితే తండ్రి ఖాలిద్ కూతురును హైదరాబాద్ లో అత్తారింట్లో వదిలేందుకని పసికందుతో కలిసి బయల్దేరారు. చేవేళ్ల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి సలేహాతో పాటు రెండు నెలల చిన్నారి దుర్మరణం చెందారు. తండ్రి ఖాలీద్ కూడా మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న రెండు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఉన్నత చదువుల కోసం వెళుతూ…

యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, అలివేలుల కూతురు అఖిల రెడ్డి(20) హైదరాబాద్ లో ఏంబీఏ చదువుతోంది. సెలవుల్లో భాగంగా సొంతూరుకు వచ్చిన అఖిల రెడ్డి సోమవారం ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ బయల్దేరింది. చేవళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్ లో ఉన్న కంకర మీదపడి బస్సులోనే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలవిసేలా విలపించారు.

కంకరలో కూరుకుపోయి.. తల్లడిల్లిన తల్లి మృతి

తాండూరు పట్టణం విశ్వంబర కాలనీకి చెందిన అబ్దుల్ మాజిద్ పట్టణంలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. సోమవారం మాజిద్ తన భార్య తబస్సుమ్ భేగం(35)తో పాటు ముగ్గురు పిల్లలతో కలిసి తాండూరులోని హైదరాబాద్ కు వెళుతున్నారు. ఆసుపత్రి పనిమీద కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్సులో బయల్దేరారు. చేవేళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కంకరలో కూరుకుపోయిన తల్లి తబస్సుమ్ తల్లడిల్లి తనువు చాలించింది. భర్త, పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనతో కుటుంబంలో విషాదం నిండింది.

తల్లిని చూసేందుకు వచ్చి..

కర్ణాటక రాష్ట్రం ముదేళ్లి సమీపంలోని బానూరు ప్రాంతానికి చెందిన నాగమణి(45) తాండూరులో ఉంటున్న తల్లి వద్దకు మూడు రోజుల క్రితం వచ్చింది. అనారోగ్యానికి గురైన తల్లిని పలకరించి.. మూడు రోజుల పాటు ఇక్కడే గడిపింది. అయితే హైదరాబాద్ లో ఉంటున్న పిల్లల వద్దకు వెళ్లేందుకు తాండూరు నుంచి ఆర్టీసీ బస్సులో బయల్దేరింది. చేవేళ్ల వద్ద జరిగిన ప్రమాదంలో నాగమణి కూడా దుర్మరణం పాలయ్యింది. దీంతో కుటుంబీకులు కన్నీరు.. మున్నీరుగా విలపించారు.

మొదటి బస్సు.. చివరి సర్వీసు..

రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు(టీజీ 34 టీఏ 6354) తాండూరు నుంచి మొదటి బస్సుగా బయల్దేరింది. బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన దస్తగిరి బాబా(45) అనే ఈ బస్సు డ్రైవర్ తాండూరు పట్టణానికి వలస వచ్చారు.
సుమారు 20 ఏండ్లుగా తాండూరు పట్టణం పాత తాండూరులో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో టిప్పర్, లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. దాదాపు పదేళ్లుగా ఆర్టీసీ ప్రైవేటు బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సోమవారం నడిపిన ప్రైవేటు బస్సుకు పది రోజుల క్రితమే డ్రైవర్ గా చేరాడు.

ప్రతి రోజూ ఇదే బస్సు హైదరాబాద్ కు మొదటి సర్వీసు బస్సుగా వెళుతోంది. సోమవారం మొదటి సర్వీసుగా వెళ్లిన బస్సు ప్రమాదానికి గురికావడంతో అతనికి చివరి సర్వీసుగా మిగిలింది. గత రెండేళ్ల క్రితం వికారాబాద్ అనంతగిరి సమీపంలో ప్రైవేటు బస్సు నడుపుతుండగా బ్రేకులు ఫేయిల్ కావడంతో అప్పట్లో చాకచక్యంగా వ్యవహరించి అందరిని కాపాడారు. కాని సోమవారం జరిగిన ప్రమాదం నుంచి తప్పించలేకపోయి.. తానుకూడా చనిపోయాడు.

దవాఖాన కోసం వెళ్లి.. భార్య, భర్తల మృతి

యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందెప్ప, లక్ష్మీ భార్య భర్తలు కూడా బస్సు ప్రమాదానికి బలై పోయారు. లక్ష్మీకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రి కోసం అని ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ కు బయల్దేరారు. చేవేళ్ల దగ్గర జరిగిన టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో భార్య భర్తలు బందెప్ప, లక్ష్మీలు మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న కుటుంభీకులు, వారి కూతుళ్లు భవాని, శివలీలు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు ఆనాథలుగా మారారు.

తండ్రికి టాటా.. చెప్పి…

బస్సు ఎక్కించేందుకు వచ్చిన తండ్రికి టాటా చెప్పిన కొన్ని గంటల్లోనే కాలేజీ కన్నుమూసింది. చేవేళ్ల మండలంలో జరిగిన టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తాండూరు మండలానికి చెందిన కాలేజీ విద్యార్థిని మృతి చెందింది. మండలంలోని కరణ్ కోట్ గ్రామానికి చెందిన చాంద్ పాష స్టోన్ వ్యాపారిగా ఉన్నారు.

మండలంలోని గౌతాపూర్ గ్రామంలో ఇళ్లు నిర్మించుకుని అక్కడే ఉంటున్నారు. వారి కూతురు ముస్కాన్(21) హైదరాబాద్ లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. సెలవులు ఎప్పుడు వచ్చినా సరే, ఆదివారం రోజు కూడా గ్రామానికి వస్తుంది. అలా సెలవులో వచ్చిన ముస్కాన్ సోమవారం తాండూరు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ కు బయల్దేరింది.

అంతకుముందే చాంద్ పాష తన కూతురు ముస్కాన్ ను బస్సులో ఎక్కించారు. తన కోసం వచ్చిన తండ్రికి బస్సులో నుంచి టాటా చెప్పి ముస్కాన్ బయల్దేరింది. కాని చేవేళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదంలో ముస్కాన్ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

Leave a Reply