ముంబయి – దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఉదయం ప్లాట్ గా ప్రారంభమైన మన సూచీలు తర్వాత రాణించాయి. బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠానికి చేరడంతో మున్ముందు ఆర్బీఐ రెపో రేటును మరింత తగ్గించొచ్చన్న అంచనాలు బ్యాంక్ స్టాక్స్ రాణించడానికి కారణమయ్యాయి.
కాగా, సెన్సెక్స్ ఉదయం 76,996.78 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,734.89) లాభాల్లో ప్రారంభమై.. తర్వాత ఫ్లాట్గానే కదలాడింది. ఇంట్రాడేలో 77,110.23 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 309.40 పాయింట్ల లాభంతో 7,044.29 వద్ద ముగిసింది. నిఫ్టీ 119.05 పాయింట్ల లాభంలో 23,447.60 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.67గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఎలాండ్, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి. . మరోవైపు అమెరికా-చైనా వాణిజ్యంపై అనిశ్చితి నెలకొనడంతో ఇతర ఆసియా మార్కెట్లు మాత్రం నష్టాల్లో ముగిశాయి.