ఆర్బీఐ టానిక్కుతో షేర్ మార్కెట్ జోష్..

- బ్యాంకులకు ఊరట
- ఆటో మొబైల్ హ్యాపీ
- 8 రోజుల లాస్ రన్ బ్రేక్ డౌన్
ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్ : రాజకీయ ఒడిదుడుకులు, నిరంతర విదేశీ పెట్టుబడిదారుల షేర్ల అమ్మకాలు ఒక వైపు.. మరో వైపు అమెరికా ట్రేడ్ వార్ దెబ్బతో గత ఎనిమిది రోజులుగా నష్టాలను మూటగట్టుకున్న షేర్ మార్కెట్ బుధవారం హుర్రే అంటూ హైజంప్ చేసింది.
ఆర్బీఐ కీలక నిర్ణయాలే షేర్ మార్కెట్ కు టానిక్కుగా పని చేశాయి. సెన్సెక్స్ ఈక్విటీ బెంచ్‌మార్క్ ఇండెక్స్ బుధవారం సెన్సెక్స్ 715.70 పాయింట్లు (0.89 శాతం) పెరిగి 80,983.31 వద్ద స్థిరపడగా, విస్తృత నిఫ్టీ 225.20 పాయింట్లు ( 0.92 శాతం) పెరిగి 24,836.30కి చేరుకుంది.
ప్రయాణీకుల వాహనాలు , వాణిజ్య వాహనాల వ్యాపారాల విభజన ఈరోజు నుంచి అమల్లోకి రావటంతో టాటా మోటార్స్, బ్లూచిప్లలో 5.5% వద్ద అత్యధికంగా లాభపడింది. ఆర్బిఐ పాలసీ ప్రోత్సాహంతో శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ తదితర బ్యాంకులు , ఆర్థిక సంస్థలు కోలుకుని ఊపిరి పీల్చుకున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ట్రెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ , సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ 4 శాతం లాభంతో బయట పడ్డాయి.
బ్యాంక్ షేర్లకు గిరాకీ :
ఆర్బీఐ రెపో పాలసీ ప్రకటన తర్వాత బ్యాంక్ నిఫ్టీ , ఆర్థిక సేవల సూచికలో భారీ కొనుగోళ్లు జరిగాయి. మూలధన మార్కెట్ రుణాలు బ్యాంకింగ్ కార్యకలాపాలపై RBI తీసుకున్న చర్యలు పెట్టుబడిదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని విశ్లేషకుల అంచనా.
బ్యాంకుల నుంచి మూలధన మార్కెట్ రుణాల పరిధిని విస్తరించాలని, రుణగ్రహీతల ఖాతా కార్యకలాపాలకు ఎక్కువ సౌలభ్యాన్ని అందించాలని, లిస్టెడ్ సెక్యూరిటీలపై రుణాలపై నియంత్రణ పరిమితిని తొలగించాలని కేంద్ర బ్యాంకు ప్రతిపాదించింది. అంతే బ్యాంక్ నిఫ్టీ 700 పాయింట్లు పెరిగింది, RBI రుణాలపై ఫిన్ నిఫ్టీ 1.2% పెరిగింది. దృఢ గ్లోబల్ సంకేతాలు కూడా ర్యాలీకి సహాయపడ్డాయి. దక్షిణ కొరియా కోస్పి అధికంగా ట్రేడ్ అవగా, US మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి.
ముడి చమురు ధరలకు బ్రేక్
బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 1.4 శాతం తగ్గి 67.02 డాలర్లకు చేరుకున్నాయి, ద్రవ్యోల్బణంపై ఆందోళనలను తగ్గించి ఈక్విటీలకు మద్దతు ఇచ్చాయి. ఇక రూపాయి కూడా కోలుకుంది, ప్రారంభ వాణిజ్యంలో US డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 88.75 వద్దకు చేరుకుంది, ఇది దేశీయ ఈక్విటీలకు మరింత ఊపునిచ్చింది.
ఆటో షేర్లకు ఊపు :
సెప్టెంబర్‌లో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల అమ్మకాలు 10 శాతం పెరిగాయని ఆటోమేకర్ మహీంద్రా అండ్ మహీంద్రా బుధవారం తెలిపింది, జీఎస్టీ కోతలు , పండుగ డిమాండ్ కారణంగా ఇది సహాయపడింది. బజాజ్ ఆటో కూడా సెప్టెంబర్‌లో ఎగుమతులతో సహా మొత్తం అమ్మకాలలో 9 శాతం వృద్ధిని 5,10,504 యూనిట్లకు నివేదించింది.
