బాసర, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర ఆలయాన్ని (Basara Temple) ప్రభుత్వం అభివృద్ధి పరుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అమ్మవారి ఆలయానికి ఆరు ఎకరాలకు పైగా విశాలమైన భూమి ఉందని, భవిష్యత్తులో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు వెళ్దామని అన్నారు.
సుమారు 190 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. ఆలయాన్ని నాలుగు విడతలుగా అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. 2027 వ సంవత్సరంలో గోదావరి పుష్కరాలు (Godavari Pushkaralu) రానున్న దృష్ట్యా ఆయా శాఖల అధికారులతో ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు నది తీరం వద్ద టూరిజం శాఖ తరపున అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.
గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా (Nizamabad District) కందకుర్తి వద్ద ప్రవేశించి గోదావరి నది తీరం వద్ద బాసర పుణ్యక్షేత్రం కొలువై ఉండడంతో గోదావరి పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పుష్కరాల ఏర్పాట్లు (Pushkar arrangements) చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గూడెం నగేష్, ఎమ్మెల్సీ దండే విటల్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, మాజీ మంత్రి ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్ విట్టల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పోలీసు అధికారులు ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.

బాసర (Basara) పాప హరేశ్వర ఆలయ సమీపాన 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం సంక్షేమ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (JupallyKrishnaRao) ఈ రోజు శంకుస్థాపన చేశారు. అలాగే వర్షాలతో దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. పుణ్యక్షేత్రం కావడంతో ముప్పయి పడకల ఆసుపత్రి అవసరం ఉన్న దృష్ట్యా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.