కర్నూలు బ్యూరో : రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా కర్నూల్ క్యాన్సర్ హాస్పిటల్ లో అత్యాధునిక సేవలు ప్రజలకు అందుబాటులో తెచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. శనివారం కర్నూలు జిజిహెచ్ లో రూ.120కోట్లతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ హాస్పిటల్ ను ఆయన పరిశీలించారు. హాస్పిటల్ తో పాటు అందులో రూ.20కోట్లతో ఏర్పాటు చేసిన పరికరాలు, వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ… కర్నూలులో రూ.120కోట్లతో స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించినట్లు తెలిపారు. ఆసుపత్రిలో అత్యధికంగా దాదాపు రెండు ఎకరాల్లో ఈ ఆసుపత్రి నిర్మించామని, ఏ ప్రభుత్వ ఆసుపత్రి లేని విధంగా కాన్సర్ ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. రూ.20కోట్ల విలువైన యంత్రాంగాలను ఇందులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రూ.10కోట్ల మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేశామన్నారు.
ప్రపంచంలో అత్యంత సేవలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. క్లిష్టమైన సర్జరీలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఈసంవత్సరంలో రోజూ మార్పులు తీసుకొచ్చిన సిబ్బందిని మంత్రి అభినందించారు. అధునాతనమైన టెక్నాలజీతో సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 40శాతం ప్రభుత్వ డాక్టర్ల కొరత ఉందన్నారు. టీచింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత చాలా ఉందని పేర్కొన్నారు. 2018లో కేంద్ర ప్రభుత్వం రూ.120కోట్లను స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ కి విడుదల చేసింది. కానీ రాయలసీమను పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణ విషయంలో ఐదేళ్ళపాటు నిర్లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. వీటివల్ల క్యాన్సర్ రోగులకు సరైన సేవలు అందక ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.45కోట్లతో టెండర్లు పెండింగ్ పనులను, యంత్రాలను కొనుగోలు పూర్తి చేసి మార్చి 4వ తేదీకి పూర్తి చేసి వైద్య సేవలు అందించామన్నారు. కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 125 అడ్మినిస్ట్రేషన్ జరిగాయి, స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి రోగులు వస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, జాయింట్ కలెక్టర్ నవ్య, కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు సర్వజన వైద్యశాలలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఏర్పాటు చేసిన లీనియర్ ఆక్సిలరేటర్, సి.టి.సిములేటర్ యంత్రాలు, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, మెడికల్ అంకాలజీ వార్డులను రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ ప్రారంభించారు.
