హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మక పోరుగా భావిస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తమ ప్రచార పంథాను ఉధృతం చేసింది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్, పూర్తిస్థాయి ప్రచారానికి సన్నాహాలు మొదలుపెట్టింది.
దీనిలో భాగంగా, బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ 40 మంది అగ్రశ్రేణి ప్రచారకర్తల (స్టార్ క్యాంపెయినర్ల) జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సమర్పించారు. దానికి ఆయన ఆమోదం లభించింది.
ఈ జాబితాలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)తో పాటు కేటీఆర్, టీ. హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు, మల్లారెడ్డి, ముహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వంటి సీనియర్ల పేర్లు కూడా ఉన్నాయి.
ఈ ప్రచారంలో కేసీఆర్ స్వయంగా పాల్గొనే అవకాశం ఉందని, ఆయన రోడ్ షో లేదా బహిరంగ సభ ద్వారా చివరి దశలో ప్రచారానికి ఊపు ఇవ్వగలరని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వాస్తవానికి, ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అభ్యర్థిని ఖరారు చేసి, కేటీఆర్ నేతృత్వంలో డివిజన్ స్థాయి సమీక్షలు, మాజీ మంత్రులకు బాధ్యతల అప్పగింత, ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేసింది.
ఈ ఉప ఎన్నికలో విజయం సాధించి గ్రేటర్ హైదరాబాద్‌పై తమ పట్టు సడలలేదని నిరూపించుకోవాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. కేసీఆర్ రంగప్రవేశం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని నాయకులు గట్టిగా విశ్వసిస్తున్నారు.