కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిదిమంది దుర్మరణం
( ఆంధ్రప్రభ, శ్రీకాకుళం బ్యూరో) : శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశిబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏకాదశి పర్వదినం రోజున వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. రెయిలింగ్ ఊడటంతో భక్తులు కింద పడ్డారు. ఇలా తొక్కిసలాట జరిగింది . మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు.
అసలేం జరిగింది ?
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కాలేదని కాశీబుగ్గకు చెందిన ఓ భక్తుడు.. సొంతంగా 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా పేరు తెచ్చుకుంది. కానీ శనివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో రావటంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మంత్రి అనిత దిగ్భ్రాంతి..
కాశీబుగ్గలో తొక్కిసలాటపై హోం మంత్రి అనిత చలించిపోయారు. తక్షణమే శ్రీకాకుళం ఎస్పీతో మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీశారు. ఎంతమంది మృతి చెందారు. ఎంత మంది గాయపడ్డారో అడిగి తెలుకున్నారు. సహాయక చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు.
ఈ దుర్ఘటన బాధాకరం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి…
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగిన దుర్ఘటన తనను తీవ్రంగా కలిసి వేసిందని, బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని,రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు .దేవాలయంలో తొక్కిసలాట జరిగి, 9 మందిభక్తులు మృతి చెందడం, మరి కొంతమంది గాయపడడం అత్యంత విచారకరం అన్నారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ బాధితులకు త్వరితగతిన వైద్య సదుపాయం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు.

