నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ…….పూర్వీకులు మనకి సనాతన ఆలయాల్ని వారసత్వంగా ఇచ్చారు. కానీ అందరికీ అవసరమైన ఆధునిక దేవాలయాలు రిజర్వాయర్లు, జలాశయాలు. అటువంటి ఆధునిక దేయాలయాలను రాష్ట్రంలో అత్యధికంగా నిర్మించే అవకాశాన్ని నాకు భగవంతుడు కల్పించాడు. జలాలే మన సంపద.. వాటితోనే రైతుల కష్టాలు తీరతాయి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం ప్రాజెక్టు గేట్లు నాలుగు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం నీటి వినియోగదారులతో ప్రత్యేక సమావేశమై ప్రసంగించారు.
నిండిన ప్రాజెక్టును చూస్తే మనసు ఆహ్లాదంగా ఉందన్నారు.నా జీవితంలో ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. జూలై నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. నిండుకుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టును చూస్తుంటే మనసు ఆహ్లాదంగా ఉందన్నారు.నేను నీటి విలువ తెలసిన వాడిని కాబట్టే కృష్ణమ్మకు జల హారతి ఇచ్చానన్నారు. భవిష్యత్తులో నీటి కొరత ఉండకుండా ఉండేందుకు కృష్ణమ్మకు హారతి ఇచ్చాను. జూలైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం శుభపరిణామం. నీటితో రాయలసీమ జలాశయాలన్నీ కళకళ్లాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో 215 టీఎంసీల నింపొచ్చు. రోజుకు 17 టీఎంసీల చొప్పున వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యామ్ కూడా నిండిందన్నరు….గంగమ్మను పూజిస్తే కరవు ఉండదు……భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకుని నా సంకల్పం నెరవేరాలని మొక్కుకున్నానని తెలిపారు.
రాయలసీమ రతనాలసీమగా మార్చాలని వేడుకున్నానన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాను. నీళ్లు మన సంపద..జలాలుంటే సందప సృష్టించుకోవచ్చు. శ్రీశైలం పవిత్రమైన పుణ్యక్షేత్రం… శక్తి పీఠం. మల్లికార్జున స్వామి చల్లగా చూసినన్ని రోజులు రాయలసీమ సుభిక్షంగా ఉంటుంది. శ్రీశైలం పేరు వినగానే మల్లన్న, రిజర్వాయర్ గుర్తొస్తాయి. దేవుణ్ని పవిత్రంగా ప్రార్థించిన విధంగానే నీళ్లను కూడా పూజిస్తే రైతులకు కష్టాలు ఉండవు. గతంలో కరవు వల్ల రాయలసీమను ఎవరూ కాపాడలేరు, రాళ్లసీమగా మారుతుందని ఆశలు వదలుకున్నాం. కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చని ఎన్టీఆర్ నిరూపించారు.
రతనాల సీమగా చేస్తానని చెప్పి ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తునన్నాం అని తెలిపారు….మరో వారంలో జీడిపల్లికి నీళ్లు…….నీళ్లిస్తే రైతులు బంగారం పండిస్తారు. సాగు బాగుండాలంటే నీళ్లుండాలి. అందుకే సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.68 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశాం. ఒక్క సీమలోని ప్రాజెక్టులకే రూ.12,500 కోట్లు వెచ్చించాం. కానీ గత ప్రభుత్వం నా రాయలసీమ..నా రాయలసీమ అని కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2024లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క హంద్రీనీవాకే రూ.3,890 కోట్లు కేటాయించి పనులు చేపట్టాం. 11వ తేదీనే పంపులు ప్రారంభించి 15వ తేదీన జీడిపల్లికి నీళ్లు తీసుకెళ్తాం. సీమలోని సాగునీటి ప్రాజెక్టులపై పేటెంట్ హక్కు ఎన్డీయే ప్రభుత్వానిదే.
హంద్రీనీవా, గాలేరు నగరి, గండికోట…ఇలా అన్ని ప్రాజెక్టులు మన ప్రభుత్వమే నిర్మించింది.అని సీఎం గుర్తు చేశారు.
.రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి….
.నేను రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటా. ఉమ్మడి రాష్ట్రం, విభజన తర్వాత కూడా నాకు ఇచ్చిన గౌరవం చరిత్రలో ఎవరికీ దక్కదు. సమైక్య రాష్ట్రంలో 9 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. విభజన తర్వాత రెండవ సారి ముఖ్యమంత్రి అయ్యాను. ప్రపంచంలోనే తెలుగుజాతి నెంబర్-1గా ఉండాలనేది నా అభిమతం. గత ప్రభుత్వం ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. చెడిపోయిన వ్యవస్థలను సరిచేస్తున్నా. అయినా 24 గంటల సమయం సరిపోవడం లేదు. వరదల సమయంలో సముద్రంలోకి నీళ్లు వృధాగా పోతున్నాయి. వాటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే రైతులకు మేలు జరుగుతుంది అని సీఎం ఆకాంక్షించారు.
…పోలవరం వల్లే సీమకు నీళ్లు……
2027 నాటికి పోలవరం పూర్తవుతుంది. 2019లో నేను మళ్లీ ముఖ్యమంత్రిని అయ్యుంటే ప్రాజెక్టును జాతికి అంకితం చేసేవాళ్లం. పోలవరం కుడి కాలువ వల్లే నేడు సీమకు నీళ్లు వస్తున్నాయి. కృష్ణా డెల్టాకు కృష్ణా నీళ్లు కాకుండా…గోదావరి నీళ్లు వాడుతున్నాం. కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు 120 టీఎంసీలు వాడి…ఆ మిగులు జలాలను సీమకు ఇస్తున్నాం.
పోలవరం…ఏపీకి వరం.
గోదావరి నుంచి 2 వేల టీఎంసీల నీరు ఏటా సముద్రంలో కలుస్తోంది. అందులో 200 టీఎంసీలు ఏపీ వాడుకున్నా, 100 నుంచి 200 టీఎంసీలు తెలంగాణ వాడుకున్నా రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి. దిగువన మనం…ఎగువన తెలంగాణ నీటిని వాడుకోవచ్చు.అని సీఎం వివరించారు.
…సీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్…….
సీమకు ఏం చేయాలో నా వద్ద బ్లూ ప్రింట్ ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సీమలో రహదారి వ్యవస్థ ఉంది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చుతాం. గతంలో సీమలో జొన్నలు, సజ్జలు, రాగులు తినేవారు…ఎన్టీఆర్ వచ్చాక రూ.2లకే కేజీ బియ్యం ఇచ్చాక అందరూ తెల్ల అన్నంకు అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు ఆహారంలో మార్పులు వచ్చి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పండ్లకు మంచి డిమాండ్ వచ్చింది. దానికి అనుకూలమైన ప్రాంతం మన రాయలసీమ. గతంలో మన ప్రభుత్వం ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్‌ను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ 90 శాతం సబ్సీడీ అందిస్తున్నాం.అని సీఎం అన్నారు. …
ఏ జిల్లాకు ఏం చేయాలో స్పష్టత ఉంది…..
ఎప్పుడూ లేని విధంగా సీమకు పరిశ్రమలు తరలి వస్తున్నాయి. కొప్పర్తి, ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు అవుతున్నాయి. సౌర, పవన, పంప్డ్ ఎనర్జీతో కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఏ జిల్లాకు ఏం చేయాలో నాకు స్పష్టత ఉంది. శ్రీశైలం, తిరుపతి, ఒంటిమిట్ట, కాళహస్తి, కాణిపాకం, అహోబిలం, కడప దర్గా, మంత్రాలయం, పుట్టపర్తి వంటి ఆలయాలు మనకు పెద్ద ఆస్తులు. రాయలసీమలో ఆధునిక దేవాలయాలైన శ్రీశైలం ప్రాజెక్టు, జీడిపల్లి, పీఏబీఆర్, పెన్నార్, చాగల్లు, గండికోట, బ్రహ్మంసాగర్, భైరవానితిప్ప, గొల్లపల్లి, అడవిపల్లి, అవుకు, సర్వారాయసాగర్, మల్లెమడుగు, కండలేరు, సోమశిల వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అన్ని రిజర్వాయర్లను నేను దేవాలయాలుగా భావిస్తున్నా. కోరికలు తీర్చమని, చల్లగా చూడాలని దేవుడికి పూజలు చేస్తాం. రిజర్వాయర్లకు, జలాశయాలకు కూడా పూజలు చేస్తే భూతల్లి కూడా చల్లగా ఉండి మన సంపదను పెంచుతుంది అని అభిప్రాయపడ్డారు.
…పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం…….
ప్రాధాన్యతా క్రమంలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం. నదులు అనుసంధానం చేయాలి. వంశధార-పోలవరం, పోలవరం – బనకచర్లకు నీళ్లు రావాలి. అప్పుడు కృష్ణానదికి ఎక్కువ నీళ్లు రాకపోయినా కరవు ఉండదు. తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, నగరి గాలేరు, హంద్రీనీవా కింద ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. రాష్ట్రంలో 1,004 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 554 టీఎంసీ నీళ్లు ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్నాయి. మరో 450 టీఎంసీలు వస్తే రాష్ట్ర జలాశయాలన్నీ కళకళలాడతాయి. మన ఆదాయం పెంచుకోవడానికి మెట్ట పంటలు కూడా వేయాలి అని పిలుపునిచ్చారు. …
ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నాం…….
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. ఆదాయాన్ని పెంచి సంక్షేమం, అభివృద్ధిని సమానంగా తీసుకెళ్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు రూ.4 వేలు పింఛను ఇస్తున్నాం. గత ప్రభుత్వానికి రూ.వెయ్యి పెంచడానికి 5 ఏళ్లు పట్టింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తున్నాం. కిడ్నీ పేషంట్లకు రూ.10 వేలు, మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. 204 అన్న క్యాంటీన్లు పెట్టాం. మరో 70 క్యాంటీన్లు ప్రారంభిస్తాం. అన్ని దేవాలయాల్లో నిత్యాన్నదాన సత్రాలు ప్రారంభిస్తాం. ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇచ్చాము. రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అందిస్తాం. మహిళలు జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు’ అని ప్రకటించారు. ….
భూగర్భ జలాలు పెంచుకుని జలాశయంగా మార్చుకుందాం…
సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని అదనంగా ఇవ్వాలంటే నీటి సంపద పెంచుకోవాలి. సాగునీటి సంఘాలు, డ్వాక్రా, విద్యా కమిటీలు నేనే తీసుకొచ్చాను. రాష్ట్రంలో 6,047 సాగునీటి సంఘాలు, 267 పంపిణీ కమిటీలు, 58 ప్రాజెక్టు కమిటీలున్నాయి. ఈ సంఘాలన్నింటితో త్వరలో అమరావతిలో సమావేశం నిర్వహిస్తాం. ఏం చేయాలో చెప్పి అధికారాలు, నిధులు సమకూర్చుతాం. చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, జలాశయాల నుంచి వచ్చే నీళ్లన్నీ వాడుకుంటాం. భూగర్భ జలాలు కూడా పెంచుకుని భూమిని కూడా జలాశయంగా మార్చుకోవాలి. భూగర్భ జలాలు వెయ్యి అడుగులకు పడిపోయాయి. అందుకే సాగునీటికి సంఘాలకు బాధ్యతలు అప్పగించి పెంచేందుకు చర్యలు ప్రారంభిస్తాం అని అన్నారు. …ప్రజలే ప్రత్యక్ష దేవుళ్లు… …రైతులు ముందుకొస్తే పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తాం. ఉత్పత్తి అయిన విద్యుత్తులో రైతులు వినియోగించుకోగా మిగిలింది ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. నేను తెచ్చే ప్రతి విధానం ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికే.
జలాశయాలన్నీ నీళ్లతో నిండాలని, పుష్కలంగా నీరు అందుబాటులో ఉండాలని మల్లికార్జునస్వామిని కోరుకుంటున్నా. పరోక్షంగా వరాలు ఇచ్చేది దేవుడు…ప్రత్యక్షంగా సహకరించేది ప్రజా దేవుళ్లు. మంచి పనులకు కులం, మతం, ప్రాంతం అడ్డం రాకూడదు. ఏ ప్రభుత్వ విధానాల వల్ల మీకు మంచి జరుగుతుందో చూసుకుని మద్ధతుగా నిలిస్తే మీ పిల్లల భవిష్యత్ బాగుంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు….
అంతకుముందు హెలికాప్టర్ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ ను, నదీ ప్రవాహాలను, పరివాహక ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు.. ..