విజయవాడ స్పోర్ట్స్(ఆంధ్రప్రభ), ఏప్రిల్ 15: మంగినపూడిలో మే 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక పర్యవేక్షణలో జరిగే బీచ్ ఫెస్టివల్‌లో క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా జాతీయస్థాయి కబడ్డీ, జల క్రీడలను నిర్వహించాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు సూచించారు. విజయవాడ శాప్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ జిల్లాల డీఎస్డీఓలు, కబడ్డీ, కెనాయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ల నిర్వాహకులతో క్రీడల నిర్వహణపై మంగళవారం ఆయన సమీక్షించారు.
ఈసందర్భంగా శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్‌లో స్పోర్ట్స్ అథారిటీకి ఆదేశించిన క్రీడా పోటీలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పక్కా ప్రణాళికలతో పకడ్బందీగా క్రీడాపోటీలను నిర్వహించి శాప్ గౌరవాన్ని మరింత పెంచాలని, దానికోసం క్రీడా అసోసియేషన్లతో పాటు డీఎస్డీఓలందరూ సమిష్టి కృషితో పనిచేయాలన్నారు. క్రీడలు నిర్వహించే అసోసియేషన్లకు శాప్ నుంచి కల్పించాల్సిన వసతులు, సౌకర్యాల ఏర్పాట్లను త్వరితగతిన తెలియజేయాలన్నారు. క్రీడల నిర్వహణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు అనుగుణంగా మెరుగైన క్రీడా వసతులు ఏర్పాటు చేయాలని వివరించారు.
ఈసందర్భంగా స్పోర్ట్స్ అసోసియేషన్ల నిర్వాహకులు మాట్లాడుతూ… కబడ్డీకి సంబంధించి 29 పురుషుల జట్లు, 29 మహిళా జట్లు పాల్గొంటాయన్నారు. అలాగే బోట్ రేసింగ్, ట్రెడిషనల్ బోట్, సీ కాయిటింగ్ పోటీలకు వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ క్రీడాకారులు హాజరవుతారని వెల్లడించారు. దీనిపై శాప్ ఛైర్మన్ బదులిస్తూ క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించే బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ తీసుకుంటుందన్నారు. బీచ్‌లో క్రీడా కోర్టులకు అనుగుణంగా ఉండే ప్రాంతాలను తక్షణమే గుర్తించాలని సూచించారు. అలాగే స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్, టెక్నికల్ టీమ్, కోచ్‌లు, రిఫరీలు, వలంటీర్లను సన్నద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా క్రీడాకారుల ప్రయోజనార్థం ట్రాన్స్‌పోర్ట్, పోలీసింగ్, ఫైర్, మెడికల్ క్యాంపులు, ప్రత్యేక కమిటీల పర్యవేక్షణపై దృష్టి సారించాలన్నారు. క్రీడా కోర్టులు, వేదికలు, గ్యాలరీల ఏర్పాట్లలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు.
అంతర్జాతీయ క్రీడాపోటీలను తలపించాలి..
బీచ్ ఫెస్టివల్‌లో క్రీడలు ఒక భాగంగా కాకుండా అంతర్జాతీయ క్రీడాపోటీలను తలపించేలా సమర్థవంతంగా నిర్వహించాలని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆదేశించారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున విచ్చేసే వీక్షకుల్లో క్రీడాస్ఫూర్తిని రగిలించేలా శాప్ కృషి చేయాలన్నారు. క్రీడాకారులందరూ అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడంతో పాటు క్రీడా వాతావరణాన్ని నెలకొల్పాలన్నారు. అసోసియేషన్ల నిర్వాహకులు, డీఎస్డీఓలు, కోచ్‌లు అందరూ అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు అదనంగా కావాల్సిన వసతులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మనం నిర్వహించే క్రీడలు మరింత మందిలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలన్నారు. ముఖ్యంగా ఈ బీచ్ ఫెస్టివల్‌లో క్రీడలు విజయవంతమవ్వాలంటే విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ముందుగానే రోజుకొక కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. దానికి సంబంధించి డిజిటల్, సోషల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఈడీ సాయిబాబా, శాప్ ఏఓ ఆర్.వెంకటరమణ నాయక్, పలువురు డీఎస్డీఓలు, కోచ్‌లు పాల్గొన్నారు.