శోభాయమానం
వైభవంగా ఆది దంపతుల గిరిప్రదక్షిణ
పౌర్ణమి వేల విధుల్లో విహరించిన స్వామి వారు అమ్మవారు..
ఎన్టీఆర్ జిల్లా బ్యూరో (ఆంధ్రప్రభ) : పౌర్ణమి సమయాన ఆదిదంపతులు భక్త జనాలకు కనువిందు చేస్తూ అనుగ్రహిస్తూ పురవీధుల్లో విహరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ అత్యంత వైభవంగా శోభాయమానంగా కొనసాగింది. ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి బుధవారం వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, దృష్టి దోష నివారణకు గుమ్మడికాయను కొట్టారు. ఆలయ స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ, ముఖ్య అతిథులు శ్రీనివాస్ శాస్త్రి తో కలసి భక్తులతో శ్రీ అమ్మవారి గిరిప్రదక్షిణకు పాదయాత్రగా ముందుకు సాగారు.
వేకువజామునే వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కనుల పండువగా జరిగిన ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆనందంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరి, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణ సాంప్రదాయాన్ని అనుసరించి వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు పొందుతారు. ఈ గిరి ప్రదక్షిణలో సంప్రదాయ కళా ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణం తీసుకొని వచ్చారు. అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారి రథం వెంట ఉత్సాహం ఆనందంతో జై భవాని జై దుర్గ భవాని నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షణ చేశారు.

