అవగాహన ర్యాలీలో ఎస్పీ సునీల్ షేరాన్…

అవగాహన ర్యాలీలో ఎస్పీ సునీల్ షేరాన్…

నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా నంద్యాల ఐఎంఏ, ఓ ఆసుపత్రి ఆధ్వర్యంలో గుండె రక్షణ కోసం నడక ప్రజా అవగాహన ర్యాలీ సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథి నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్(SP Sunil Sheron) ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అమిత ఆహారం, పొగ తాగడం తదితర అలవాట్లకు వీడి వ్యాయామం చేస్తూ గుండెను పది కాలాలపాటు పదిలంగా రక్షించుకోవచ్చు అన్నారు.

ఐఎంఏ(IMA) రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ(Ravi Krishna), ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు(Dr. Madhusudana Rao)లు మాట్లాడుతూ. ప్రజల అవగాహన కోసం ఐఎంఏ ఆధ్వర్యంలో వివిధ రకాల వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. గుండె జబ్బుల వైద్య నిపుణులు డాక్టర్ జహంగీర్(Dr. Jahangir), డాక్టర్ మురళీకృష్ణ, గుండె శస్త్ర చికిత్స నిపుణులు, డాక్టర్ కోటి శ్రీనివాస్ మాట్లాడుతూ మధుమేహం.

బీపీ రోగులు స్థూలకాయం రాకుండా చూసుకోవాలని, సరైన చికిత్స తీసుకుంటూ వీటిని నియంత్రణలో ఉంచుకోవాలన్నారు. నిత్యం క్రమం తప్పకుండా నడక తదితర వ్యాయామాలు చేయాలన్నారు. పొగాకు సేవనానికి దూరంగా ఉంటే గుండె జబ్బులు రావని సూచించారు. ఛాతీ లో నొప్పి(Pain in Chest), ఒళ్లంతా చెమటలు పట్టడం, ఛాతీ నొప్పి భుజానికి, వెనుకకు, దవడకు పాకినట్లు ఉండడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు అజాగ్రత్త చేయరాదన్నారు.

ఎటువంటి శ్రమ, మెట్లు ఎక్కడం, ఎక్కువ దూరం నడవడం లాంటివి చేయకుండా వెంటనే ఈసీజీ(ECG) తీసి ఇతర పరీక్షలు చేసి అది గుండె పోటు కాదా అని నిర్ధారణ చేసే ఆసుపత్రులకు వెళ్లడం ఎంతో అవసరం అన్నారు. గుండెపోటు వచ్చిన సమయంలో మొదటి గంట చాలా కీలకమన్నారు. ఆ సమయంలో సరైన చికిత్స(Treatment) చేస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు అన్నారు.

ఒకసారి గుండెపోటు వస్తే యాంజియోగ్రామ్(Angiogram) పరీక్ష చేయించుకుని గుండె రక్త నాళాలు మూసుకుపోయి ఉన్నాయా లేదా తెలుసుకుని యాంజియో ప్లాస్టి అవసరాన్నిగుర్తించాలన్నారు. ఎక్కువ నాళాలు మూసుకుపోతే బైపాస్ ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవలో ఈ చికిత్సలను పొందుపరిచారని అన్నారు.

ఆసుపత్రి నుంచి ప్రారంభమైన గుండె రక్షణ కోసం నడక ర్యాలీ సంజీ వనగర్ గేట్ వరకు కొనసాగింది. పెద్ద ఎత్తున వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది గుండె రక్షణకు సంబంధించిన స్లోగన్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్(ASP Javali Alphonse), స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, టూ టౌన్ సీఐ అస్రార్ భాష, వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ హరినాథ రెడ్డి, డాక్టర్ విజయ బాబు, డాక్టర్ వివేకానంద రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, డాక్టర్ శ్రావణి, డాక్టర్ షర్మిల, డాక్టర్ మహమ్మద్ పాల్గొన్నారు.

Leave a Reply