SP | కోడి పందాలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు

SP | కోడి పందాలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు
- జీవ హింసకు పాల్పడితే ఉపేక్షించం
- డ్రోన్, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
- ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడి
SP | తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : హైకోర్టు ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లాలో కోడి పందాలు, పేకాట, మట్కా తదితర జూద క్రీడల నిర్వహణలో పాల్గొనడం పూర్తిగా నిషేధమని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. సంప్రదాయం ముసుగులో జీవ హింసకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
కోడి పందాలు లేదా జూదం నిర్వహించినా, వాటికి స్థలాలు లేదా పొలాలు కల్పించినా, నిర్వాహకులు, పాల్గొన్న వారందరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తెలిపారు. కోళ్లకు కత్తులు కట్టిన వారు, వాటిని తయారు చేసినా లేదా సరఫరా చేసినా వారిపైనా కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
జిల్లావ్యాప్తంగా డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీస్ బృందాల సహాయంతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గతంలో కోడి పందాలు, జూదం జరిగిన ప్రదేశాలు, నిర్వాహకులపై ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షణ చేపట్టామని వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
సంక్రాంతి పండుగను శాంతియుతంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ప్రజలకు జిల్లా ఎస్పీ సూచించారు. కోడి పందాలు వంటి అక్రమ క్రీడలకు బదులు కబడ్డీ, ఖో-ఖో వంటి సంప్రదాయ క్రీడలతో పాటు బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్‌బాల్, క్రికెట్ వంటి క్రీడలను నిర్వహించుకోవాలని సూచించారు.
జూదం, మట్కా వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల వల్ల సులభంగా డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో పడి ప్రజలు తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారని, ఇది కుటుంబాలు–సమాజానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఇటువంటి అక్రమ క్రీడలను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతోందన్నారు.
జిల్లాలో ఎక్కడైనా కోడి పందాలు, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112, పోలీస్ వాట్సాప్ నంబర్ 80999 99977కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
