సదరన్ డిస్కమ్ సరికొత్త ప్రయోగం
తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : ప్రీ పెయిడ్ మీటర్ల పై ప్రజల్లోని వ్యతిరేకత తగ్గించడానికి తిరుపతి కేంద్రం రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో పనిచేసే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(Power Distribution Company) (ఏపీఎస్ పీడీసీఎల్) సరికొత్త ప్రయోగం చేస్తోంది. 9 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో 100 మంది చొప్పున విద్యుత్ ఉద్యోగుల ఇళ్లకు ప్రయోగాత్మకంగా ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్లను అమర్చనుంది. ఇలా మీటర్ల పనితీరును అధ్యయనం చేస్తారు. ఈ మేరకు చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఈరోజు నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో ప్రకటించారు.
ఈ-వ్యాలెట్ రీచార్జింగ్ ప్రక్రియ, ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, వినియోగంపై పూర్తి స్థాయిలో నమ్మకం కలిగిన తర్వాతనే వినియోగదారుల ఇళ్లకు అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. అదేవిధంగా 9 జిల్లాల్లో జాతీయ రహదారి పక్కన వున్న సబ్-స్టేషన్ల ప్రాంగణంలో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనువుగా వున్న ప్రాంతాలను గుర్తించాలని ఎస్ఈలను ఆదేశించారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసి వున్న ఈవీ చార్జింగ్ స్టేషన్లను పరిశీలించి, అధ్యయనం చేయాలని సూచించారు. సబ్-స్టేషన్లతో పాటు ప్రభుత్వ స్థలాలు, ఆసుపత్రులు తదితర ప్రాంతాలను కూడా పరిశీలించాలన్నారు.
ఈ అంశంపై వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే సంస్థ పరిధిలో 11కేవీ ఫీడర్లకు స్మార్ట్ మీటర్లను అమర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. తిరుపతి కార్పొరేట్ కార్యాలయం నుంచి బుధవారం డైరెక్టర్లు పి. ఆయూబ్ ఖాన్, కె. గురవయ్య, కె. రామమోహన్ రావులతో కలిసి నిర్వహించిన ఈ సమావేశం లో చీఫ్ జనరల్ మేనేజర్ జె. రమణా దేవి, 9 జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లు చంద్ర శేఖర్ రావు, ఇస్మాయిల్ ఆహ్మద్, రాఘవేంద్ర, శేషాద్రి శేఖర్, రమణ, ప్రదీప్ కుమార్, సుధాకర్, సంపత్ కుమార్, ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

