HYD | హైద‌రాబాద్‌లో రుతురాగం.. ముందుగానే వ‌చ్చేసిన నైరుతీ !

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ‌: తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్ర‌వేశించాయి. అంచనా వేసిన సమయం కంటే ముందుగానే రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించ‌డంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మంగ‌ళ‌వారం రుతు ప‌వ‌నాలు తాకుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

దీంతో న‌గ‌రంలో ఎప్పుడైనా భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ హెచ్చ‌రిక‌లు జారీచేసింది. సిటీలోని ప‌లు ప్రాంతాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున న‌గ‌ర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

ప‌లు ప్రాంతాల్లో 40 నుంచి 60 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు సగటు సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 5.8 కి.మీ మధ్యలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది.

దీని ప్రభావంతో ఈరోజు (మంగళవారం) ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని, 29లోగా బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నది. దీంతో 27,28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Leave a Reply