2027 వన్డే వరల్డ్​కప్‌న‌కు సౌతాఫ్రికా ఆతిథ్యం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు 2027 వన్డే వరల్డ్​కప్​ (2027 ODI World Cup) టోర్నమెంట్​కు ఆతిథ్యం ఇచ్చే అవ‌కాశం వ‌చ్చింది. మళ్లీ దాదాపు 24 ఏళ్ల తర్వాత సఫారీ జట్టు టోర్నమెంట్ ఆతిథ్య హక్కులు అందుకుంది. అంత‌కుముందు ఈ మెగాటోర్నీకి సౌతాఫ్రికా (South Africa) చివరిసారి 2003లో ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన 2007, 2011, 2015, 2019, 2023 టోర్నీల్లో సౌతాఫ్రికాకు అవకాశం దక్కలేదు. దీంతో టోర్నమెంట్​ను ఘనంగా నిర్వహించేందుకు సఫారీ క్రికెట్ బోర్డు ప్లాన్స్ చేస్తుంది. కాగా, 2027 వరల్డ్​కప్​ అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగనుంది.

మూడు దేశాలు సంయుక్తంగా…
2027 వన్డే వరల్డ్​కప్​ టోర్నమెంట్​కు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు (South Africa Cricket Board) సన్నాహాలు ప్రారంభించింది. రాబోయే ఈ టోర్నీలో సౌతాఫ్రికాతోపాటు జింబాబ్వే, నమీబియా (Zimbabwe, Namibia) సంయుక్తంగా ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నమెంట్​లో లీగ్ మ్యాచ్​లు, సెమీఫైనల్, ఫైనల్ (Semifinal, Final) సహా 54 మ్యాచ్​లు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్‌ను దృష్టిలో ఉంచుకుని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ దేశంలో మ్యాచ్‌లు జరిగే స్టేడియాలను ఫైనలైజ్ చేసింది.

సౌతాఫ్రికాలో అత్యధిక మ్యాచులు
టోర్నీలో మొత్తం 54 మ్యాచ్​లు ఉండగా, అందులో అత్యధికంగా 44 మ్యాచ్​లకు సౌతాఫ్రికానే ఆతిథ్యం ఇవ్వనుంది. మిగిలిన 10 మ్యాచ్‌లు జింబాబ్వే, నమీబియాలో జరుగుతాయి. 44 మ్యాచ్‌లను నిర్వహించడానికి సౌతాఫ్రికా దేశంలో 8 స్టేడియాలను ఎంపిక చేసినట్లు సౌతాఫ్రికా స్థానిక టోర్నమెంట్ నిర్వాహక కమిటీ బోర్డు (LOCB) ఛైర్మన్, మాజీ కేబినెట్ మంత్రి ట్రెవర్ మాన్యుయేల్ ప్రకటన చేశారు. ఇందులో జొహెన్నస్​బర్గ్​లోని వాండరర్స్ స్టేడియం, కేప్​టౌన్​లోని న్యూ లాండ్స్ క్రికెట్ గ్రౌండ్స్, డర్బన్ కింగ్స్ మీడ్ క్రికెట్ గ్రౌండ్, ప్రిటోరియా సెంచూరియన్ పార్క్, బ్లూమ్ ఫోంటైన్ మాంగాంగ్ ఓవల్, గ్కెబెరాలోని సెయింట్ జార్జ్ పార్క్, ఈస్ట్​ లండన్​లోని బఫెలో పార్క్, పార్ల్ బోలాండ్ పార్క్ ఉన్నాయి. ఈ ఎనిమిది నగరాల్లోని స్టేడియాల్లో మొత్తం 44 మ్యాచ్​లు జరగనున్నాయి. నమీబియాలోని విండ్‌హోక్‌లోని యునైటెడ్ గ్రౌండ్, నమీబియా క్రికెట్ గ్రౌండ్​తోపాటు, జింబాబ్వే బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌ స్టేడియాల్లో మిగిలిన 10 మ్యాచ్​లు జరిగే అవకాశం ఉంది.

ఈసారి మారిన టోర్నీ ఫార్మాట్
2023 వరల్డ్​కప్​ (2023 World Cup)లో గ్రూపులు లేకుండానే టాప్ 4 జట్లు సెమీస్​కు వెళ్లాయి. కానీ ఈసారి టోర్నీ ఫార్మాట్ మారనుంది. ఇందులో 14 జట్లు పాల్గొననున్నాయి. సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వద్ద ఆతిథ్య హక్కులు ఉన్నాయి. కాబట్టి ఈ మూడు జట్లు నేరుగా క్వాలిఫై అయిపోతాయి. మొత్తం 14జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్​లు నిర్వహించనున్నారు. ఇందులో ప్రతి గ్రూప్ నుంచి టాప్- 3 జట్లు సూపర్ సిక్స్‌(Super Six)లో ఆడడానికి అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సూపర్ 6లోని టాప్ 4 జట్లు సెమీఫైనల్స్ ఆడతాయి. ఇందులో నెగ్గిన జట్ల మధ్య టైటిల్ పోరు ఉంటుంది. ఈ ఫార్మాట్‌లో గతంలో రెండుసార్లు (1999, 2003) వన్డే ప్రపంచ కప్ జరిగింది.

Leave a Reply