తెనాలిలో అల్లుడి కిడ్నాప్ కలకలం
కేసును ఛేదించి పోలీసులు.. కథ సుఖాతం
ఐదుగురు నిందితుల అరెస్ట్
తెనాలి, అక్టోబర్ 19( ఆంధ్రప్రభ): అత్త మరో నలుగురు వ్యక్తులతో కలిసి అల్లుడిని కిడ్నాప్ చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తీవ్ర కలకలం సృష్టించింది. బాధితుడి స్నేహితుల సమాచారం నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని కాపాడి ఐదుగురిని అరెస్ట్ చేశారు. తెనాలి పట్టణం చంద్రబాబు నాయుడు కాలనీ నివాసి మణికంఠతో వినుకొండకు చెందిన లిఖిత కు రెండేళ్ల క్రితం వివాహమైంది. మణికంఠ అత్త విజయలక్ష్మికి మణికంఠతో విభేదాలు వచ్చాయి.

ఈ క్రమంలో అత్త వినుకొండకు చెందిన నలుగురు యువకులతో కలిసి ఓ కారులో శనివారం అర్ధరాత్రి మణికంఠ నివాసానికి చేరుకుంది. మణికంఠతో వాగ్యుద్ధం తరువాత అత్తతో వచ్చిన నలుగురు వ్యక్తులు మణికంఠను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకు వెళ్లారు. మణికంఠ స్నేహితుడు జరిగిన ఉదంతాన్ని 112 నంబర్ కు ఫిర్యాదు చేసి పట్టణ మూడవ పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కారును వెంబడించి తెనాలి నారాకోడూరు రహదారి మార్గంలో చేబ్రోలు మండలం సేకూరు వద్ద కారును ఆపి కిడ్నాప్‌కు ప్రయత్నించిన విజయలక్ష్మి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కిడ్నాప్ వినియోగించిన కారును త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కిడ్నాప్ ఉదంతాన్ని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ సాంబశివరావు నేతృత్వంలో డీఎస్పీ జనార్దన రావు సూచనల మేరకు పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ విషయంపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాంబశివరావు వెల్లడించారు.