సింగారపేని గుట్టను మింగేస్తున్న ‘మట్టి’ అసురులు!

సింగారపేని గుట్టను మింగేస్తున్న ‘మట్టి’ అసురులు!

  • -ఇప్పగూడెంలో ఆగని అక్రమ తవ్వకాలు.. కళ్లప్పగించి చూస్తున్న యంత్రాంగం
  • — ఆంధ్రప్రభ కథనంతోనైనా యంత్రాంగం కదులుతుందా ?
  • — నేడు అధికారుల తీరుపైనే సర్వత్రా ఉత్కంఠ..చర్యలా? మళ్లీ మామూళ్లేనా?

స్టేషన్ ఘన్‌పూర్ , ఆంధ్రప్రభ : ప్రకృతి సంపదను కొల్లగొడుతూ నిబంధనలను తుంగలో తొక్కి సాగిస్తున్న సింగారపేని గుట్ట మట్టి దందా పై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం శివారులోని గుట్టను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం పై పత్రికల్లో కథనాలు వెలువడటంతో.. నేడు అధికారులు ఏ తీరుగా స్పందిస్తారన్నది ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది.

-పగలు రాత్రి తేడా లేదు.. జేసీబీలతో వేట!
అనుమతులు ఉన్నాయో లేదో తెలియదు కానీ, సింగారపేని గుట్ట దగ్గర నిత్యం వందల లారీలు మట్టి తరలిపోతున్నాయి. భారీ జేసీబీలతో గుట్టను పిండి చేస్తూ ప్రకృతి స్వరూపాన్ని మార్చేస్తున్నారు. దీనివల్ల చుట్టుపక్కల పొలాలకు ధూళి చేరి రైతులు నష్టపోతుండగా, మిషన్ భగీరథ పైపులైన్లు ధ్వంసమవుతున్నాయి.

  • ఫిర్యాదులు బుట్టదాఖలేనా?
    అక్రమ తవ్వకాలపై ఇప్పగూడెం గ్రామస్తులు పలుమార్లు రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించకపోవడం వెనుక పెద్దల ‘హస్తం’ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నటి కథనంతోనైనా మొద్దు నిద్ర వీడి అక్రమ లారీలను సీజ్ చేస్తారా? లేక ఎప్పటిలాగే చూసీ చూడనట్లు వ్యవహరిస్తారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
  • తీవ్ర ప్రమాదంలో పల్లె బాటలు..
    మట్టి లోడుతో వెళ్లే భారీ వాహనాల ధాటికి అంతర్గత రహదారులు కుంగిపోతున్నాయి. నిత్యం దుమ్ము, ధూళితో గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తవ్వకాలను అడ్డు కోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇప్పగూడెం గుట్ట రక్షణలో అధికారుల చిత్తశుద్ధి నేడు తేలనుంది. చర్యలు తీసుకుంటారో? మామూలుగా వదిలేస్తారో వేచి చూడాలి.
  • మట్టి టిప్పర్లకు గ్రామస్తుల అడ్డుకట్ట..
    ఇప్పగూడెం గ్రామ శివారులోని కుర్చపల్లి వెళ్లే రహదారి పక్కన అక్రమంగా మట్టి తరలింపులు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు శనివారం రాత్రి ఆందోళనకు దిగారు. మట్టి టిప్పర్లను అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తూ తమ ఆవేదనను వ్యక్తపరిచారు.

-మైనింగ్, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించాలి:
(మహమ్మద్ షాబుద్దీన్, ఇప్పగూడెం రైతు)
మా గ్రామంలో గుట్ట ప్రాంతంలో జరుగుతున్న తవ్వకాల వల్ల అడవి జంతువుల సంచారం చాలా పెరిగిపోయింది. రాత్రి వేళల్లో ఎలుగుబంట్లు, నెమళ్ళు, హైనాలు పంట చేలలోకి వచ్చి మా పంటలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులందరం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రాత్రి సమయంలో గ్రామంలో నుంచి టిప్పర్లతో మట్టిని తరలించడం వల్ల మాకు భయాందోళనలు పెరిగిపోయాయి. పిల్లలు, మహిళలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నాం.

  • మా జీవితం అక్రమ తవ్వకాల వల్ల నరకంలా మారింది : మునిగేల సోమేశ్వర్, ఇప్పగూడెం రైతు
    మేము ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే పాలు పోయడానికి వెళ్తాం. కానీ గుట్ట వద్ద జరుగుతున్న అక్రమ తవ్వకాల వల్ల మా జీవితం నరకంలా మారింది. రోడ్డంతా గుంతలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ప్రమా దమే కనిపిస్తుంది. చీకట్లో రోడ్డు కనిపించక నేను రెండు సార్లు కిందపడిపోయాను. టిప్పర్ల రాకపోకలతో ఎగిసే దుమ్ము మా పంట పొలాల పై కూర్చి పంటలను నాశనం చేస్తోంది. ఎంత కష్టపడి పండించిన పంటకి దిగుబడి రావడం లేదు. ఇలా మేము ఎంత కాలం బాధపడాలి.? వెంటనే మైనింగ్, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ తవ్వకాలను ఆపించి, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నాం.

Leave a Reply