కేంద్రానికి ప్రభుత్వం ప్రతిపాదనలు
గేమ్‌చేంజర్‌గా మారనున్న కొత్త రైలుమార్గం
10 జిల్లాలకు మెరుగుకానున్న రవాణా
సరుకుల రవాణాకు సరికొత్త మార్గం
వ్యవసాయ ఉత్పత్తుల తరలింపుకు ఊతం
సికింద్రాబాద్ స్టేసన్‌పై తగ్గనున్న భారం
శివారు పట్టణాలు, పారిశ్రామిక జోన్లలో అభివృద్ధి
ఎక్కడా లేనటువంటి రవాణా తెలంగాణకు సొంతం
ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్ మారే చాన్స్
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక.. ప్రధాని మోదీ సర్కారు రహదారులు, రైలు మార్గాల విస్తరణ, రవాణా సౌకర్యం మెరుగుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో అనేక జాతీయ రహదారులను కేంద్రం నిర్మిస్తోంది. ఇంకా నిర్మాణంలో అనేక రహదారులున్నాయి. ఇక.. రైలు మార్గాల విస్తరణ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. తెలంగాణలో కూడా రహదారులు, రైలు మార్గాల విస్తరణ జరుగుతోంది. తాజాగా. హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు మార్గాన్ని నిర్మించే ప్రాజెక్టు తెరమీదకు వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి రకం ప్రయత్నంగా ఇది గుర్తింపు పొందింది. ఇటీవల పూర్తయిన ఫైనల్ లొకేషన్ సర్వేతో, ఈ ప్రాజెక్టు దిశగా కీలక అడుగు పడింది. సికింద్రాబాద్ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లే ఆరు రైలు మార్గాలతో రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు అనుసంధానం కానుంది. ఈ సరికొత్త ప్రాజెక్టుతో రాష్ట్ర రవాణా వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చనుంది.
Also Read – Tirupati | వ్యర్థాలతో ఎనర్జీ .. సద్వినియోగం చేసుకోవాలన్న చంద్రబాబు
అసలేంటీ రింగ్ రైలు ప్రాజెక్టు?
హైదరాబాద్ చుట్టూ నిర్మించే ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రాష్ట్ర రవాణా వ్యవస్థను మార్చివేయనున్న ఒక గేమ్-చేంజర్. 536-564 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం, సికింద్రాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, వరంగల్, నిజామాబాద్, మెదక్, ముంబై, వికారాబాద్ వంటి ఆరు కీలక రైలు మార్గాలతో అనుసంధానం కానుంది. దేశంలోనే మొట్టమొదటి రింగ్ రైలు ప్రాజెక్టుగా, ఇది హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు, చుట్టుపక్కల జిల్లాలకు సమర్థవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది.
ప్రాంతీయ అనుసంధానం..
ఈ ప్రాజెక్టు 8-10 జిల్లాలను (మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, జనగామ, కామారెడ్డి) కలుపుతూ, కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణంతో ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. ఇది స్థానిక వ్యవసాయ, వ్యాపార, విద్య, ఆరోగ్య, పర్యాటక రంగాలను బలపరుస్తుంది, వరి, మొక్కజొన్న, పత్తి, పసుపు వంటి వ్యవసాయ దిగుబడులకు మార్కెటింగ్‌కు ఊతమిచ్చే అవకాశం ఉంది. ఈ రైలు మార్గం ప్రధానంగా గూడ్స్ రైళ్లను సికింద్రాబాద్, హైదరాబాద్, నాంపల్లి స్టేషన్ల గుండా వెళ్లకుండా ఇతర రూట్లలోకి మళ్లించడానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల ఈ స్టేషన్లపై ఒత్తిడి తగ్గి, సరుకు రవాణా సమర్థత పెరుగుతుంది. సిమెంట్, క్లింకర్ వంటి పరిశ్రమలకు ఈ మార్గం ఒక వరంగా మారనుంది.
మూడు ఎలైన్‌మెంట్లతో ఆప్షన్లు..
దక్షిణ మధ్య రైల్వే మూడు ఎలైన్మెంట్ ఆప్షన్లను ప్రతిపాదించింది, వీటిలో ఆప్షన్-2 జనగామ, కామారెడ్డి జిల్లాలను కూడా కలుపుతుంది. ఈ ఆప్షన్లు వివిధ జిల్లాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. తుది ఎలైన్‌మెంట్ ఖరారు కోసం విశ్లేషణ జరుగుతోంది. ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌లోని రద్దీని తగ్గించడంతో పాటు, రీజనల్ రింగ్ రోడ్‌తో సమన్వయంతో కొత్త శివారు పట్టణాలు, పారిశ్రామిక జోన్ల అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇది రాష్ట్రంలోని సామాజిక-ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తూ, హైదరాబాద్‌ను ఒక ప్రపంచ స్థాయి నగరంగా మరింత బలోపేతం చేస్తుంది.

