ఆరో రోజు – అలిగిన బ‌తుక‌మ్మ..

తెలంగాణ‌లో బ‌తుక‌మ్మ పంగుడ ఘ‌నంగా జ‌రుగుతుంది. ఆడ‌ప‌డుచులు ప్ర‌తీ రోజు తీర‌కొక్క పూల‌తో బతుక‌మ్మ‌ను త‌యారు చేసిన పూజ‌లు చేస్తున్నారు. ఇప్పటికి ఐదు రోజుల ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మలు ముగియగా… నేడు ఆరో రోజు బతుకమ్మ పండుగ జరుపుకునే ‘అలిగిన బతుకమ్మ’.

బతుకమ్మ పండుగలో ఆరవరోజును ‘అలిగిన బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజు మహిళలు పూలతో బతుకమ్మను తయారు చేయరు. అలాగే, గౌరమ్మకు ఎటువంటి నైవేద్యం కూడా సమర్పించరు. బతుకమ్మ అలక తీరాలని ప్రార్థనలు మాత్రమే చేస్తారు.

పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో అనుకోకుండా ఒక మాంసం ముద్ద బతుకమ్మకు తగిలి అపచారం జరిగిందని ఒక కథనం చెబుతుంది. దీనితో బతుకమ్మకు కోపం వచ్చిందని, అందుకే ఆరోజు బతుకమ్మ అలక తీరాలని పూజలు మాత్రమే చేస్తారు.

దేవీభాగవతం ప్రకారం, నవరాత్రులలో దుర్గాదేవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలలో రాక్షసులైన భండాసురుడు, చండముండులను సంహరించిన తర్వాత ఆరో రోజున చాలా అలసిపోయిందని చెబుతారు. ఆ అలసట నుండి అమ్మవారికి విశ్రాంతిని ఇవ్వడానికి ఆ రోజు బతుకమ్మను ఆడరని, అందుకే దీనిని ‘అలిగిన బతుకమ్మ’ అని పిలిచేవారని అంటారు.కాలక్రమంలో ఇదే ‘అలిగిన బతుకమ్మ’గా మారిపోయింది.

ఈ కారణాల వల్ల బతుకమ్మ పండుగలో ఆరవరోజున పూలు పేర్చడం, నైవేద్యాలు సమర్పించడం జరగదు. మహిళలు బతుకమ్మకు అలక తీరాలని ప్రార్థించి, మరుసటి రోజు వేడుకలకు సిద్ధమవుతారు.

Leave a Reply