Site encroachment | గ్రామ పంచాయతీ స్థలం కబ్జాపై…

Site encroachment | గ్రామ పంచాయతీ స్థలం కబ్జాపై…
- మండిపడ్డ పాలకవర్గం
Site encroachment | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పంచాయతీకి చెందిన విలువైన స్థలాలపై జరుగుతున్న అక్రమ కబ్జాలపై పాలకవర్గం తీవ్రంగా స్పందించింది. ఎడపల్లి గ్రామంలోని వారాంతపు సంత కొనసాగే ప్రదేశం సమీపంలో ఉన్న గ్రామపంచాయతీ స్థలాన్ని కొందరు అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఇవాళ గ్రామపంచాయతీ అధికారులు అక్కడ నోటీసు బోర్డును ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ మజ్కూరు గంగాధర్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు పాల్గొని, అక్రమ కబ్జాల పట్ల తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీకి చెందిన స్థలాలు ప్రజల అవసరాల కోసం కేటాయించబడినవని, వాటిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆక్రమించడం చట్ట విరుద్ధమని వారు స్పష్టం చేశారు.
పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నోటీసు బోర్డు(Notice board)లో, ఈ స్థలం గ్రామపంచాయతీకి చెందినదని, ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేదా ఆక్రమణలు చేయరాదని హెచ్చరికలు పొందుపరిచారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ…. ఎడపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఏ ప్రభుత్వ లేదా పంచాయతీ స్థలాలపై అయినా అక్రమంగా కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు(strict action) తప్పవని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకొని, ఆక్రమణలను తొలగిస్తామని హెచ్చరించారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేటాయించిన పంచాయతీ స్థలాలను రక్షించేందుకు పాలకవర్గం ఎప్పటికీ అప్రమత్తంగా ఉంటుందని, గ్రామస్తులు కూడా సహకరించాలని అధికారులు కోరారు.
