SIT | సుబ్బారెడ్డి ఇంట్లోనే సిట్..
ఆంధ్రప్రభ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై నమోదైన కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వేగవంతం చేసింది. ఈ క్రమంలో టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే సుమారు మూడున్నర గంటల పాటు ప్రశ్నించారు.
ఈ కేసులో ఇప్పటికే సుబ్బారెడ్డి పీఏ.. చిన్న అప్పన్నను అరెస్ట్ చేసిన సిట్, అతని ఎకౌంట్‌లో జమ అయిన నాలుగు కోట్ల రూపాయల మూలంపై కీలక సమాచారాన్ని సేకరిస్తోంది. అప్పన్న వాంగ్మూలంలో బయటపడిన వివరాల ఆధారంగానే సిట్ ఇప్పుడు సుబ్బారెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇటీవల సిట్, విచారణ కోసం విజయవాడకు రావాలని సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే తాను హాజరు కాలేనని తెలిపిన నేపథ్యంలో, విచారణ బృందం స్వయంగా హైదరాబాద్ చేరుకుని ఆయన నివాసంలోనే విచారణ కొనసాగించింది.
గత వైసీపీ ప్రభుత్వ కాలంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన సమయంలో… లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన కంపెనీలు, కుదిరిన కాంట్రాక్టులు, ఛైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలు వంటి అంశాలపై సిట్ సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సుబ్బారెడ్డి విచారణ పూర్తైన తర్వాత కేసులో మరిన్ని కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

