Singareni | అక్టోబర్ నాటికి సోలార్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేయాలి : ఎన్.బలరాం

  • ఆలస్యం జరిగితే కాంట్రాక్టు రద్దు చేస్తాం
  • బ్యాటరీ నిల్వ వ్యవస్థ పనులు ఆగస్టు నాటికి పూర్తి చేయాలి

రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి సంస్థ చేపట్టిన సోలార్ ప్లాంట్ల నిర్మాణాలను ఒప్పందంలో పేర్కొన్న కాలపరిమితికి లోబడి పూర్తి చేయాలని, నిర్మాణ పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఏజెన్సీల కాంట్రాక్టులు రద్దు చేస్తామని, బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ హెచ్చరించారు.

హైదరాబాద్ సింగరేణి భవన్ లో సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై అధికారులు, సంబధిత కాంట్రాక్టర్లతో ప్రత్యేకించి సమీక్షించారు. మొదటి దశలో ఇంకా పూర్తి చేయాల్సి ఉన్న 54.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం, రెండవ దశలో పూర్తి చేయాల్సి ఉన్న 67.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియపై ఆయన నిశితంగా సమీక్షించారు.

ఈ నిర్మాణాలను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయకుండా, తీవ్ర జాప్యం చేస్తున్న నిర్మాణ ఏజెన్సీలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిల్లుల చెల్లింపుల విషయంలో సింగరేణి సంస్థ నుంచి ఎటువంటి జాప్యం లేనప్పటికీ నిర్మాణ సంస్థలు తమ పనులను సకాలంలో పూర్తి చేయకపోవడం శోచనీయమన్నారు.

అక్టోబర్ నెల నాటికి వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఇకపై ఎటువంటి పొడిగింపులు ఉండవని స్పష్టం చేశారు. నిర్మాణ ఏజెన్సీలకు ఇదే చివరి అవకాశంగా భావించాలని, నిర్మాణాలను అక్టోబర్ కల్లా పూర్తి చేయనట్లయితే సదరు ఏజెన్సీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేయడం జరుగుతుందని, పనుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహించిన వారిని కంపెనీలో బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని కూడా ఆయన హెచ్చరించారు.

మందమర్రిలో 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ కు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం (బి.ఇ.ఎస్.ఎస్) వ్యవస్థ పనులను కూడా ఆగస్టు లోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కాగా కేంద్ర ప్రభుత్వ సూర్య ఘర్ యోజన పథకం కింద సింగరేణిలో వివిధ భవనాలపై చేపట్టిన 32.75 మెగావాట్ల రూఫ్ టాప్ ప్లాంట్ల నిర్మాణపు పనులన్నీ డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో డైరెక్టర్ ఈ అండ్ ఎం సత్యనారాయణ రావు, ఈడీ కోల్ మూమెంట్ ఎస్.డి.ఎం సుభాని, జనరల్ మేనేజర్ (సోలార్) బి.సీతారామం, జనరల్ మేనేజర్ (వర్క్ షాప్) ఫ్రిజరాల్డ్, పీపీడీ(హెచ్‌వోడీ) విశ్వ‌నాథ‌రాజు, సంబంధిత ఏరియా ఇంజినీర్లు, సోలార్ ప్లాంట్ల ఇంజినీర్లు, వర్క్ షాప్ ఇంజినీర్లు, వివిధ కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply