Simhachalam | కోటి న‌ష్ట‌ ప‌రిహారం ఇవ్వండి .. బాధితుల డిమాండ్ ను పరిశీలిస్తామ‌న్న‌ హోం మంత్రి

సింహ‌చ‌లం – సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇక కేజీహెచ్ ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను నేడు హోంమంత్రి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.కోటి పరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి.
ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబాలు రూ.కోటి నష్టపరిహారం అడుగుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా జిల్లాల్లోని ఎమ్మెల్యేలమంతా బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిందని తెలిపారు.

అంతేకాకుండా పిల్లల్ని ప్రభుత్వపరంగా చదవిస్తామని హామీ ఇచ్చారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబాలకు అప్పగిస్తామని తెలిపారు. గోడ కూలిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసిందని.. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని అనిత హెచ్చరించారు.

చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు..

అలాగే ఈ దురదృష్టకర సంఘటనలో ఎన‌మిది మంది మరణించారని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చందనోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారని ముందుగానే అంచనా వేసి, అందుకు తగిన ఏర్పాట్లు చేశామని, తాను కూడా రెండు రోజుల క్రితం ఏర్పాట్లను పరిశీలించానని అనిత చెప్పారు. “ఇది ఊహించని ఘటన. గోడ కూలుతుందని ఎవరూ ఊహించలేరు. అర్ధరాత్రి వర్షం పడుతున్న సమయంలో మేం కూడా ఇక్కడే ఉన్నాం, దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ప్రమాదం గురించి తెలిసింది. వెంటనే ఇక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాం. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగలేదు” అని తెలిపారు.
గోడ కూలిన ఘటనకు దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరుపుతామని హోంమంత్రి స్పష్టం చేశారు. కూలిన గోడ నిర్మాణం ఎప్పుడు జరిగింది? కాంట్రాక్టర్ ఎవరు? నిర్మాణంలో నాణ్యతా లోపాలున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు ఉంటుందన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని, విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *