Sigachi | బాధితుల పరిహారం ఏమైంది?

Sigachi | బాధితుల పరిహారం ఏమైంది?
ఆగమేఘాల మీద కాదు ఆలోచించి హామీలివ్వాలి
ప్రభుత్వానికి చురకలంటించిన జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
Sigachi | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సిగాచి (Sigachi) ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి మృతిచెందిన కుటుంబ సభ్యులకు ఇస్తామన్న రూ.కోటి పరిహారం ఏమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (Chinta Prabhakar) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాలుగు నెలలు గడిచినా బాధిత కుటుంబీకులకు పరిహారం అందలేదని మండిపడ్డారు. సిగాచి కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాద ఘటనలో బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్ (Collector) ప్రావీణ్యకు, జిల్లా ఎస్పీ(Sp) పరితోష్ పంకజ్ కు సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగాచి పేలుడు బాధితులకు రూ.కోటి పరిహారం (Rs.1 crore Compensation) ప్రకటించి చేతులు దులుపుకున్నారని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఎద్దేవా చేశారు. సిగాచి పేలుడు ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు కంపెనీ నుంచి రూ.25 లక్షలు, ప్రభుత్వం తరపున లక్ష మాత్రమే ఇచ్చారని తెలిపారు. మిగతా పరిహారం కోసం బాధిత కుటుంబ సభ్యులు కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), జిల్లా మంత్రి, సంబంధిత మంత్రులు, అధికారులు వచ్చినా.. నేటికీ సమస్య పరిష్కారం కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు (Manik Rao) మాట్లాడుతూ.. సిగాచి పరిశ్రమ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల నష్టపరిహారం కూడా ఇంతవరకు అందలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పరిహారాలు వెంటనే విడుదల చేసేదని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామన్న పరిహారాన్ని వెంటనే బాధితులకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావులు అన్నారు. ఈ కార్యక్రమంలో గడిల శ్రీకాంత్ గౌడ్, మోహిజ్ ఖాన్, కాసాల బుచ్చిరెడ్డి, ఆర్.వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.
