సిక్కోలు అన్నదాత విలవిల

  • సిక్కోలు అన్నదాత విలవిల

కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, గాలులకు పొట్ట, వెన్ను దశలో ఉన్న వరి పంట చాలాచోట్ల నేల పాలైంది. పొలాల్లో నీరు నిండటంతో పంట నీట మునగడం వల్ల రైతు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

మండలంలో 16, 500 ఎకరాల్లో వరి సాగు అవుతుండగా ఇందులో 30 శాతం వరకు పంట ఇప్పటికే నేల కొరిగిపోయింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పంటను కాపాడుకోవాలంటే పొలంలో నీటిని ఎప్పటికప్పుడు బయటికి విడిచి పెట్టాలని మండల వ్యవసాయ అధికారి ఎస్. గోవిందరావు సూచిస్తున్నారు.

నిందుకుండల్లా చెరువులు, గెడ్డలు

తుఫాన్ ప్రభావంగా బుధవారం సాయంత్రానికి మండలంలో 4.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఇప్పటికే నీటితో నిండిపోయిన చెరువులు, గెడ్డలు గట్ల పైనుంచి నీరు పారుతోంది. కోటబొమ్మాలి వద్దగల మంగళి గెడ్డ ఉదృతంగా ప్రవహిస్తోంది. దీని దిగువ నున్న వరి పంట పొలాలకు ముంపు భయం పొంచి ఉంది. స్థానిక ఎరకాశి చెరువు, లింగు బారి కోనేరు పూర్తిగా నిండిపోయాయి.

లింగు బారి కోనేరు నిండి రోడ్డుపై నుంచి నీరు రెడ్డిక వీధిలోకి ప్రవహిస్తోంది. తుఫాన్ తీరం దాటడంతో మండలంలో ఏమైనా నష్టాలు జరిగాయా అన్న విషయమై తహసిల్దార్ ఆర్. అప్పలరాజు, ఎంపీడీవో కే. ఫణీంద్ర కుమార్ అన్ని శాఖల అధికారుల నుంచి బుధవారం వివరాలు సేకరిస్తున్నారు. తుఫాను ప్రభావం మండలంలో అంతగా చూపకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply