తేమశాతం సడలింపుతో కొనుగోలు చేయాలి..
మక్తల్, ఆంధ్రప్రభ : రైతులు పండించిన వరి ధాన్యం ఇటీవల కురిసిన వర్షాలకు రంగు మారిందని అంతేకాకుండా అల్పపీడన ప్రభావం ముసురు వర్షాల వల్ల తేమ శాతం తగ్గకపోవడంతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని తేమశాతం సడలింపుతో రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నారాయణ పేట జిల్లా ప్రధాన కార్యదర్శి జి.బలరాం రెడ్డి(G. Balaram Reddy) డిమాండ్ చేశారు. ఈ రోజు మక్తల్ లో ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ.. వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో వర్షాలు కురుస్తుండటంతో వరికోత మిషన్ల కొరత వేధిస్తుండటం వల్ల రైతులు అధిక కిరాయి చెల్లించి పంట కోసుకుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రైతులను నట్టేట ముంచుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు ఎంతో ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు, కానీ రైతులు పండించిన వరి ధాన్యం వాతావరణ పరిస్థితుల వల్ల రంగు మారి తేమ శాతం తగ్గడం లేదు. నిబంధనలను సడలించి ప్రభుత్వం రంగు మారిన తేమ శాతం ఎక్కువగా ఉన్న వడ్ల ను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని(Fasal Bima Yojana Scheme) తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి ఉంటే అధిక వర్షాలకు నష్టపోయిన పత్తి, కంది, వరి తదితర పంటల కు బీమా మొత్తం అంది రైతులకు లాభం చేకూరేదని ఆయన అభిప్రాయపడ్డారు. వరి పంటకు ఇస్తామన్న బోనస్ డబ్బులు యాసంగి పంట కాలానివి, ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న ఖరీఫ్ సీజన్(Kharif Season)కు బోనస్ డబ్బులు కేంద్రం ఇస్తున్న ఎంఎస్పీ 2,380 రూపాయలతో పాటు చెల్లించాలన్నారు. అంతేకాకుండా రైతులు పండిస్తున్న అన్ని పంటలకు (పత్తి, కంది, వేరుశెనగ మొదలుగునవి) 500 రూపాయలు బోనస్ చెల్లించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి(Balaram Reddy) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

