shock | మరీ ఇంత బెట్టు చేయాలా..?

shock | మరీ ఇంత బెట్టు చేయాలా..?
- షాకిస్తున్న గోల్డ్ రేట్స్
- నేనేం తక్కువ కాదంటున్న సిల్వర్
- బెంబేలెత్తుతున్న విక్రయదారులు
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఎండాకాలంలో ఎండలు భగ్గుమన్నట్లు బంగారం ధరలు కూడా అదే స్థాయిలో భగ్గుమంటున్నాయి. ముట్టుకుంటేనే షాక్ ఇస్తున్నాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్, శుభముహూర్తాల సమయంలో బంగారం, వెండి ధరలు పెరుగుతుంటే కొనుగోలు దారులు అవాక్కవుతున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు పరుగెడుతున్నాయి. వివాహాల కోసం పోగుచేసిన డబ్బంతా బంగారం కొనడానికే సరిపోయేలా ఉందని విక్రయదారులు తలలు బాదుకుంటున్నారు.

గోల్డ్, సిల్వర్ రేట్లు కొనుగోలు దారులకు షాక్ ఇస్తున్నాయి. సడెన్గా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బంగారం ధర గత 4 రోజులుగా పెరిగితే, వెండి ధర ఐదు రోజులుగా పెరుగుతోంది. తులం బంగారం ధర 4 రోజుల్లో రూ.7 వేల పైనే పెరిగింది. కిలో వెండి ధర 5 రోజుల్లో రూ.40,000 పెరిగింది. ఇంతగా ధరలు పెరుగుండటం చూసి విక్రయదారులు బెంబేలెత్తుతున్నారు. పెళ్లిళ్ల సీజన్లో ఇలా ధరలు పెరిగితే ఎలా కొంటామని కళ్లు తేలేస్తున్నారు. వారం క్రితం వరకు ధరలు తగ్గాయని సంతోషపడే లోపలే ధరలు పైపైకి పోతున్నాయి. ఇలా అయితే వివాహాలు చేసేదెలా అని మధ్యతరగతి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇవాళ (ఫిబ్రవరి 23న) 24 క్యారట్ బంగారం ధర రూ.2,070 పెరిగి రూ.1,59,280 నుంచి రూ.1,61,350కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.1,900 పెరిగి రూ.1,46,000 నుంచి రూ.1,47,900కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1,550 పెరిగి రూ.1,19,460 నుంచి రూ.1,21,010కి చేరింది. కిలో వెండి ధర ఇవాళ రూ.10,000 పెరిగి రూ.2,90,000 నుంచి రూ.3,00,000కి చేరింది. తులం వెండి ధర రూ.3,000గా ఉంది.

