విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రెండో రోజు శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు మంగళవారం రోజు ప్రారంభం కాగా..ఈ నెల 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి. రెండవ రోజు అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక, రేపటితో ఈ శాకంబరీ మహోత్సవాలు ముగియనున్నాయి.. శాకంబరీ దేవి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మకు కూరగాయలతో విశేష అలంకారం చేశారు..
ఇక, అమ్మవారికి విరాళంగా కూరగాయలను సమర్పిస్తున్నారు భక్తులు.. హరిత వర్ణంలో ఇంద్రకీలాద్రి శోభిల్లుతోంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు..
మొదటి రోజున ఆలయ అలంకరణ, కదంభం ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు 50 టన్నుల కూరగాయల వినియోగించారు.. ప్రధాన ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు, మహా మండపంలో ఉత్సవ మూర్తి, ఉపాలయాలల్లో దేవతామూర్తులంతా హరిత వర్ణంతో విరాజిల్లుతున్నారు.
ఇక, భక్తుల రద్దీ దృష్ట్యా.. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు ప్రత్యేక, అంతరాలయ దర్శనం రద్దుచేశారు అధికారులు.. ఉదయం 8లకు సప్తశతీ పారాయణం, మహావిద్యా పారాయణము మరియు హోమాలు నిర్వహించనున్నారు.. సాయంత్రం 5కి మూల మంత్రహవనములు, మండప పూజ, హారతి, మంత్రపుష్పము, ప్రసాద వితరణ జరగనుంది.. ఆషాఢ సారె సమర్పణ బృందాలు, శాకంభరీ దేవి దర్శనం కొరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు..