Chennai | రైల్లో గర్భిణీపై లైంగిక దాడి..
- ప్రతిఘటించడంతో కిరాతకుడి హత్యాయత్నం
- వెల్లూరు ఆసుపత్రిలో క్షతగాత్రురాలికి వైద్యం
ఎన్నో ఏళ్ల తరువాత తాను తల్లిని కాబోతున్నానని చిత్తూరులోని తన తల్లికి శుభవార్త చెప్పేందుకు రైలులో బయలుదేరిన గర్భిణీని ఓ కామాంధుడు చెరబట్టబోయాడు. ఆ అభాగ్యురాలు ప్రతిఘటించగా ఆ కిరాతకుడు రెచ్చిపోయాడు. గర్భిణీని నడుస్తున్న రైలు నుంచి తోసి చంపే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో ఆ మహిళ తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం వెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పాత నేరస్తుడని గుర్తించి అరెస్టు చేశారు. ఇదే నిందితుడిని గతంలో హత్య, దోపిడీ కేసుల్లో అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.