రైతుల డిమాండ్ ఇదే..

కర్నూలు బ్యూరో, (ఆంధ్రప్రభ) : ఇటీవల కురిసిన అకాల వర్షాలు వలన కర్నూలు జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వచ్చింది. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలోని పలు మండలాల్లో రైతులు (Farmers) భారీగా నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నివేదించారు. జిల్లా వ్యవసాయ శాఖ అందించిన వివరాల ప్రకారం.. మొత్తం 27 గ్రామాల్లో 2,209 మంది రైతులు ప్రభావితమయ్యారు. పంటలు నీట మునిగిపోవడం, అధిక తేమతో కుళ్లిపోవడం, కొన్ని ప్రాంతాల్లో నిలువ పంటలు కూలిపోవడం జరిగింది. హోలగుంద మండలంలో 4 గ్రామాలు ప్రభావితమయ్యాయి. సుమారు 150 హెక్టార్లలో పంటలు నష్టపోయాయి. ఈ ప్రాంతంలో పంటలు “పానికిల్ ఇనిషియేషన్ నుండి గ్రైన్ ఫిల్లింగ్” దశలో ఉండగా, వర్షాల ప్రభావంతో పంటలు నేలకూలాయి.

కోసిగి మండలం (Kosigi Mandal) లోని 3 గ్రామాల్లో 125 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి. పంటలు ఎదుగుదల దశలో ఉండటంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంత్రాలయం మండలంలో 8 గ్రామాల్లో సుమారు 85 హెక్టార్ల పంటలకు భారీ నష్టం జరిగింది. పంటలు గ్రైన్ హార్డెనింగ్ దశలో ఉండగా, కురిసిన భారీ వర్షాలతో ధాన్యాలు నేలకూలి, గింజలు ఊడిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆలూరు మండలంలో 4 గ్రామాలు ప్రభావితమయ్యాయి. సుమారు 92 హెక్టార్లలో పంటలు నీట మునిగిపోయాయి. చిప్పగిరి మండలంలో 20 గ్రామాల్లో సుమారు 17 హెక్టార్ల పంటలు పూర్తిగా మునిగిపోయి, అధిక తేమ వల్ల కుళ్లిపోయాయి.

మద్దికేర మండలం (Maddikera Mandal)లో కూడా రైతులు పెద్దఎత్తున నష్టపోయారు. మొత్తం 27 గ్రామాల్లో 2,209 మంది రైతులు ప్రభావితం అవ్వగా, ప్రాథమిక అంచనాల ప్రకారం 1,469 హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు అంచనా వేశారు. వర్షాల ప్రభావంతో పంటలు ప్రధానంగా వరి, జొన్న, పెసర, సెనగ వంటి పంటలు దెబ్బతిన్నాయి. పంటలు కొంతమేర వెజిటేటివ్ దశలో ఉండటంతో వేర్లకు తేమ అధికమై పంటలు ఎండిపోతున్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సూచనలతో వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందాలు గ్రామాల వారీగా పంట నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. త్వరితగతిన వివరాలు సేకరించి ప్రభుత్వం వద్ద నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం. జిల్లాలో వర్షాల ప్రభావం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుండగా, ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply