టి టి డి మాజీ ఏ వి ఎస్ ఒ అనుమానాస్పద మృతి
పరకామణి చోరీ కేసులో నిందితుడు

తిరుపతి ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : తిరుమల పరకామణి చోరీ కేసులో పెను సంచలనం చోటు చేసుకుంది.మొత్తం వ్యవహారానికి సంబంధించిన టి టి డి మాజీ విజిలెన్సు అధికారి (TTD ex vigilance officer dead suspicious) సతీష్ కుమార్ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో అనంతపురం జిల్లాలో రైల్వే ట్రాక్ వద్ద శవమై ( Dead body found on railway track) కనిపించారు. కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ చోరీకి పాల్పడి పట్టుబడిన నిందితుడు సి వి రవికుమార్ ను లోక్ అదాలత్ కోర్టు ద్వారా రాజీ కుదిర్చి వదిలిపెట్టిన నేరంపై సతీష్ కుమార్ ను ఇటీవలే విచారించింది. తిరుమలలోని జియ్యర్ మఠానికి చెందిన గుమస్తా స్థాయి ఉద్యోగి కోయంబత్తూరు వెంకట (సి వి ) రవికుమార్ 2023 ఏప్రిల్ 29వ తేదీన తిరుమలేశుని హుండీ కానుకలను లెక్కించే పరకామణి విధులను నిర్వహిస్తూ కొన్ని విదేశీ నోట్లను దొంగలిస్తూ పట్టుబడ్డాడు. (Acused in parkamani case) తరువాత జరిగిన విచారణలో గత 20 ఏళ్లుగా ఇదే తరహాలో చోరీలు చేసి కోట్లాది ఆస్తులు కొన్నట్టు అతడే ఒప్పుకున్న నేపథ్యంలో అప్పటి టి టి డి అధికారులు ఆ దోచుకున్న మొత్తం ఆస్తులు తిరుమలేశునికి సమర్పించే విధంగా లోక్ అదాలత్ లో కుదిర్చి వదిలి పెట్టారు. ఆ ఒప్పందం మేరకు రూ 14 కోట్ల విలువైన స్థిరాస్తులను తిరుమలేశునికి కానుకగా ఇచ్చే ప్రక్రియకు అప్పటి టి టి డి ధర్మ కర్తల మండలి ఆమోద ముద్ర వేసింది. ఆ అనధికార రాజీ ఒప్పందం వెనుక వంద కోట్ల కు పైగా అప్పటి పెద్దలు పంచుకున్నారనే ఆరోపణలపై దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం పై స్పందించిన రాష్ట్ర హై కోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సి ఐ డి అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ను నియమించింది. తాజాగా విచారణ చేపట్టిన సిట్ అధికారులు చోరీ కేసులో రాజీ కుదర్చడంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం గుంతకల్ లో రైల్వే పోలీసు ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న సతీష్ కుమార్ ను తిరుపతికి పిలిపించి విచారించారు. అవసరమైన సమాచారం సేకరించి మళ్ళీ పిలిచినప్పుడు రావాలని చెప్పి పంపించివేశారు. ఇదిలా ఉండగా సతీష్ కుమార్ శుక్రవారం అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. అది హత్యా ఆత్మహత్యా అనే విషయం తేలాల్సివుంది. పోలీసు దర్యాప్తు లో తేలే అంశాల ఆధారంగానే సతీష్ కుమార్ ఆత్మహత్య కు పాల్పడ్డారా లేక ఎవరైనా హత్య చేశారా అనే విషయం తేలుతుంది ఇదిలాఉండగా సతీష్ మరణ వార్త తెలిసిన వెంటనే తిరుపతిలో పరకామణి చోరీ కేసును విచారిస్తున్న సి ఐ డి అధికారులు అలెర్ట్ అయ్యారు . Cid officers alerted) అనంతపురం జిల్లా పోలీసులతో సంప్రదించి దర్యాప్తు వివరాలను సేకరించడం మొదలు పెట్టారు. దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి అయినా సతీష్ అనూహ్యంగా మరణించడం పెను సంచలనం మారుతోంది

