ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత క‌న్నుమూత‌….

కాశీబుగ్గ, ఆంధ్రప్రభ : ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు రేవా కోటేశ్వరరావు (85) వయోభారంతో వరంగల్ డాక్టర్స్ కాలనీ లోని తన నివాసంలో శనివారం కన్నుమూశారు. వరంగల్‌లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ విస్తరణకు ఆయన చేసిన సేవలు ప్రత్యేకమైనవి. ఆంధ్ర ప్రాంతం నుండి 65 ఏళ్ల క్రితం వరంగల్‌కు వచ్చిన కోటేశ్వరరావు స్థానిక మహబూబియా హైస్కూల్లో హిందీ పండిట్‌గా పనిచేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు.

ప్రచారక్‌గా సూర్యాపేటలో తన సేవలను ప్రారంభించిన ఆయన, అనంతరం వరంగల్ జిల్లాలో కార్యవాహ, బౌద్ధిక్ ప్రముఖ్, విభాగ్ కార్యవాహ, విభాగ్ సంఘచాలక్, ప్రాంత సహ కార్యవాహ, ప్రాంత కార్యకారిణి సభ్యుడు వంటి పదవుల్లో సేవలందించారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లోని శాఖలను సందర్శిస్తూ, శనివారంనాడు పాఠశాల ముగిసిన వెంటనే పర్యటనకు వెళ్లి సోమవారం ఉదయం తిరిగి విధుల్లో చేరడం ఆయన సాధారణ విధానం.

1975 ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలో ఉండి వరంగల్ జిల్లాలో పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అలాగే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో జరిగిన రామ జన్మభూమి ఉద్యమాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. రేవా కోటేశ్వరరావు మృతి పట్ల ఆర్ఎస్ఎస్ వరంగల్ విభాగ్ సంఘచాలక్ ప్రొఫెసర్ చిలకమారి సంజీవ, కార్యవాహ ప్రొఫెసర్ గద్దె రమేష్ సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply