సీమ రైతుకు అరటి ఆరళ్లు..

  • ధర లేక పశువులకు అరటి గెలలు వేస్తున్న రైతులు
  • గోరుచుట్టుపై రోకటి పోటు వలె పంటపై ఫంగస్‌ దాడి
  • ఘొల్లుమంటున్న అరటి రైతాంగం శ్రీ ఇక ఢిల్లీ వ్యాపారులే ఆశాకిరణం
  • రాష్ట్రంలో ఏటా 70 లక్షల మెట్రిక టన్నుల అరటి ఉత్పత్తి
  • అందులో అధిక డిమాండ్‌ ఉన్న జీ-9 రకం అరటి ఉత్పత్తిలో 50 శాతం సీమ నుంచే
  • అదుకునే కృషిలో అధికార యంత్రాంగం

తిరుపతి (రాయలసీమ), ఆంధ్రప్రభ బ్యూరో : తినేవారికి తీపిని పంచే అరటిపండు పండించిన రాయలసీమ రైతుకు చేదు మిగులుస్తోంది. ఏడాది క్రితం టన్ను రూ.28 వేలకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం రూ వెయ్యి రూపాయలకు అడుగు తుంటే రూ.లక్షలు ఖర్చు పెట్టి పండించిన రైతులు గొల్లు మంటున్నారు. గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో కొందరు తోటలను బుల్డోజర్లతో దున్నేస్తుంటే మరి కొందరు కష్టపడి పండించిన అరటిపళ్ళను జీవాలకు ఆహారంగా పడేస్తున్నారు.

ఎగుమతులు తగ్గిపోవడం, ఉత్తర భారత రాష్ట్రాల వాణిజ్య సంస్థలు అక్కడి పంటకే ప్రాధాన్యం ఇవ్వడం మౌలిక కారణాలవుతున్నాయి. దీనికి తోడుగా మంథా తుపాను కారణంగా మారిన వాతావర ణంలో అరటి పంటపై సెగతోక ఫంగస్‌ దాడి చేయడంతో సీమ రైతు పరిస్థితి పాలిట పులి మీద పుట్ర లా తయారైంది ఈ నేపథ్యం లో ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాల ఫలితంగా త్వరలో వస్తామంటు-న్న ఢిల్లీ వ్యాపారవర్గాలే రాయలసీమ అరటి రైతాంగం పాలిట ఆశాకిరణాలవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ రకాల పళ్ళు ఉత్పత్తులు ఏటా దాదాపు 200 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా అందులో కేవలం అరటి పళ్ళ ఉత్పత్తి మాత్రమే దాదాపు 70 లక్షల మెట్రిక్‌ టన్నుల దాకా ఉంటాయి. అందులో ఎక్కువ డిమాండ్‌ ఉన్న జి 9 రకం అరటి పళ్లలో 50 శాతం పైగా అరటి పళ్ళు రాయలసీమకు చెంది న ఉమ్మడి కడప, అనంతపురం జిల్లాలోనే పండుతాయి.

దానికి తగినట్టుగానే రాయలసీమలో పండే పంటలో 60 శాతం దేశ విదేశాలకు ఎగుమతులు అవుతుంటాయి. సగటున ప్రతి ఏడాది టన్ను అరటి పళ్ళను రూ 20 వేలకు కొనుగోలు చేసుకెళ్లే వ్యాపా రులు గత ఏడాది టన్ను రూ 28 వేలకు కొనుగోలు చేసుకెళ్లారు. ఆ ఉత్సాహంతో ఈ ఏడాది అరటి రైతులు ఉమ్మడి కడప, అనం తపురం జిల్లాల్లో 70 వేల ఎకరాలకు పైగా అరటి సాగు చేశారు.

దాదాపు 40 వేల ఎకరాలో అరటి పంట వేసిన అనంతపురం జిల్లా రైతులు . రెండో, మూడో విడత దిగుబడి పూర్తి చేసుకుని మొదటి దిగుబడికి సిద్ధం అవుతుండగా కడప జిల్లా రైతులు రెండవ, మూడవ దిగుబడులతో పాటు- మొదటి దిగుబడి పూర్తి అయ్యే పరిస్థితికి చేరుకున్నారు.

అరటి రైతుకు డిమాండ్‌ షాక్‌

అయితే ఆశించిన రీతిలో గత ఏడాది కనిపించిన ఉత్సాహం ఈ ఏడాది మార్కెట్‌లో కనిపించలేదు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు తగ్గిపోయారు. వచ్చిన వ్యాపారులు టన్ను వెయ్యి రూపాయలకు మించి కొనలేమని చేతులెత్తేశారు. ఇందుకు భారతీయ మార్కెట్‌ ద్వారా భారీగా దిగుమతులు చేసుకునే ఇరాన్‌ ఇరాక్‌ మొదలైన దేశాలు పెద్దగా ఆశక్తి చూపక పోవడమే కారణంగా వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.

రవాణా పరమైన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని వ్యాపార వర్గాలు మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల వైపు దృష్టిని సారించాయి. దీనికి తోడు ఇటీవలి తుఫాను కారణంగా వాతావరణ మార్పులతో అరటి తోటలపై సిగతోక ఫంగస్‌ దాడి చేసింది. దాంతో కిరణ జన్య సంయోగ క్రియ లోపంతో ఆకులు మాడిపోయి, అరటి గెలలు రాలిపోవడం మొదలైంది.. ఎకరాకు రూ 2 లక్షల వరకు ఖర్చు చేసి అరటి సాగు చేసిన రైతులు కునారిల్లిపోయారు.

ఆదుకునే కృషిలో అధికార యంత్రాంగం

రైతులను ఆదుకోడానికి రంగంలో దిగిన ప్రభుత్వ యంత్రాంగం వ్యాపార వర్గాలతో సమావేశాలు నిర్వహించింది. ఒక దశలో అనంతపురం జిల్లా కలెక్టర్‌ కిలో రూ 6 నుంచి రూ 8 లకు కొనుగోలు చేయకపోతే డ్వాక్రా సంఘాల ద్వారా ఇంటింటికి విక్రయించే ఏర్పాటు చేస్తామని వ్యాపార వర్గాలను హెచ్చరించారు.

ఫలితంగా ఎగుమతిదారులు కేజీ రూ 8 లకు, స్థానిక వ్యాపారులు కేజీ రూ 5 లకు కొనుగోలు చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. అధికారిక ప్రయత్నాలు ఫలించి కర్ణాటక, తెలంగాణ ప్రాంత వ్యాపారులు కేజీ రూ 4 నుంచి రూ 5 లకు కొనుగోలు చేయడానికి అంగీకరించినట్టు అధికారులు చెబుతున్నారు.

ఇంకోవైపు సీమ అరటి రైతు సమస్య తీర్చడానికి ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో అధికారులు, రైతు ప్రతినిధులు బయ్యర్‌ సెల్లర్స్‌ మీట్‌ , హర్యానా, సోనేపట్‌లలోని అరటి అగ్రిగేటర్ల మీట్‌ నిర్వహించే కొనుగోలుకు రమ్మని ఆహ్వానించారు. ఆ సందర్భంగా సానుకూలంగా స్పందించిన ఢిల్లీ ఆజాద్‌ పూర్‌ మండి వ్యాపారులు, హర్యానా కు చెందిన వాణిజ్య వ్యవస్థల ప్రతినిధులు ఓ రెండు వారాల తరువాత వచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే వారందరూ వచ్చి కొనుగోళ్లు చేసినా గత ఏడాది లాగా భారీ గా కాకుండా టన్ను అరటికి రూ.10 వేలు నుంచి రూ 15 వేలు వరకు ధర లభించే అవకాశాలు ఉంటాయని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు.

ఈ పరిణామాలు మాత్రమే కునారిల్లి పోయిన సీమకు చెందిన ముఖ్యంగా మొదటి దిగుబడికి సిద్ధం అవుతున్న అనంతపురం అరటి రైతుకు ఊరట కలిగించే అంశాలుగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రభుత్వ యంత్రాంగం కృషి ఫలిస్తే ఈ ఏడాది సీమ అరటి రైతు గుడ్డిలో మెల్ల లా బయటపడే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి.

Leave a Reply