భద్రత కట్టుదిట్టం

భద్రత కట్టుదిట్టం
భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లపై సమీక్ష
అమ్మ శీఘ్రదర్శనానికి అవసరమైన ఏర్పాట్లు
రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
మెరుగైన సౌకర్యాలకు ప్రత్యేక యాప్
విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : భవానీ దీక్షల విరమణ సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు (SV Rajasekhar Babu) తెలిపారు. భవానీలకు అమ్మవారి శీగ్ర దర్శనం కోసం అవసరమైన రద్దీని నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్న ఆయన మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించామని తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో అవసరమైన మేరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయడంతో పాటు హోల్డింగ్ ఏరియాలలో అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి (Sri Durga Malleshwara Swamy) వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే భవాని దీక్షల విరమణ సందర్భంగా దేవస్థానం, పోలీస్ అధికారులతో సీపీ రాజశేఖర్ బాబు శుక్రవారం తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులు త్వరితగతిన క్యూలైన్లలో కదిలే విధంగా భక్తుల సౌకర్యార్థం అవసరమైన ప్రదేశాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లను ఏర్పాటు చేయడంపై చర్చించారు. భవానీ భక్తులందరూ ఈ ప్రత్యేకమైన యాప్ లో రిజిస్టర్ అయ్యేవిధంగా చర్యలు చేపడతామని తెలిపారు.
దీక్షా విరమణకు మన రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే నేపథ్యంలో కల్పిస్తున్న పోలీసు భద్రత బందోబస్తు, మౌలిక సదుపాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. హోల్డింగ్ ఏరియాలను ఉపయోగించుకుని క్యూలైన్లలో రద్ది, స్నానఘాట్ల వద్ద రద్దీ, ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించి భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేవిధంగా,గిరి ప్రదక్షణ సమయంలో భవాని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా, సామాన్య ప్రజలు, వాహనధారులు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఈ సందర్భంగా సీపీ సూచనలు చేశారు.
దీక్షా విరమణకు వచ్చిన భక్తులు సులభంగా సమాచారం తెలుసుకుని త్వరితగతిన వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు తో పాటు, డీసీపీ. కృష్ణ కాంత్ పాటిల్, టెంపుల్ ఈ.ఓ. శ్రీనానాయక్ , ఎ.డి.సి.పి జి.రామకృష్ణ, ఏ.సి.పి. దుర్గారావు , ఇనస్పెక్టర్ గురు ప్రకాష్, దేవస్థాన అధికారులు, దేవస్థాన ఐ. టి ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
