భారీ ఉగ్ర కుట్ర భగ్నం

హర్యాణా : భద్రతా దళాలు దేశంలో మరో పెద్ద ఉగ్రవాద కుట్రను సఫలంగా అడ్డుకున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), జమ్ము కశ్మీర్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) పోలీసులు ఉమ్మడిగా చేపట్టిన రహస్య ఆపరేషన్‌లో హర్యాణాలోని ఫరీదాబాద్‌లో ఓ వైద్యుడి నివాసంలో భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో 300 కేజీల RDX, ఏకే-47 రైఫిల్స్, వందల కొద్దీ మందుగుండు సామాగ్రి దొరికాయి. ఈ ఆయుధాలతో దేశ రాజధాని ప్రాంతంతో పాటు పలు కీలక నగరాల్లో భారీ దాడులు చేయాలని ఉగ్రవాదులు (Terrorists) కుట్ర పన్నినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

మూడు రోజుల క్రితం జమ్ము కశ్మీర్ (Jammu Kashmir) పోలీసులు అనంత్‌నాగ్ జిల్లాలో డాక్టర్ ఆదిల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన కీలక సమాచారం, ఇంటరాగేషన్‌లో వెల్లడైన వివరాల ఆధారంగానే భద్రతా సంస్థలు ఫరీదాబాద్‌పై దృష్టి సారించాయి. డాక్టర్ ఆదిల్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఈ ఆపరేషన్‌లో ఇంకా కొందరు నిందితుల అరెస్టుకు గస్తీ బలగాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సంఘటన దేశ భద్రతా వ్యవస్థల అప్రమత్తతను మరోసారి నిరూపించింది. ఉగ్రవాద బెడదను అరికట్టేందుకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, పోలీసు బలగాలు రాష్ట్రాల మధ్య సమన్వయంతో పనిచేస్తున్నాయనే సంకేతం ఇది.

Leave a Reply