searches | చేసేది చిరు ఉద్యోగం.. సంపాదన కోట్లలో..

searches | చేసేది చిరు ఉద్యోగం.. సంపాదన కోట్లలో..
- ఏసీబీ మాజీ హోంగార్డు ఇంట్లో సోదాలు
- ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తింపు
searches | విజయనగరం క్రైమ్, ఆంధ్రప్రభ : విజయనగరం కేంద్రంలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఆయనొక చిరు ఉద్యోగి నెట్టి శ్రీనివాసరావు. సుమారు 15 సంవత్సరాల పాటు ఏసీబీ శాఖలో హోంగార్డుగా పనిచేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు.చేసేది చిరు ఉద్యోగం.సంపాదన మాత్రం కోట్ల రూపాయలు. సుమారు15 సంవత్సరాలు ఏసీబీలో హోంగార్డుగా పనిచేసి ఎంతోమందిని అవినీతిపరులను పట్టుకోవడంలో భాగస్వామిగా ఉన్న ఆ హోంగార్డు చివరకు అదే ఏసీబీ అధికారులచే అరెస్టు కావడం విచిత్రమే అయినప్పటికీ ఇది సత్యం.
విజయనగరం జిల్లా గుర్ల మండలానికి చెందిన నెట్టి శ్రీనివాసరావు ప్రస్తుతం హోంగార్డుగా జిల్లా పోలీస్ శాఖలో విధులను నిర్వహిస్తున్నాడు. 15 సంవత్సరాల పాటు హోంగార్డుగా ఏసీబీలో పనిచేసిన శ్రీనివాసరావు అదే ఏసీబీ ని ఆసరాగా చేసుకుని అవినీతిపరులకు అవసరమైన సమాచారం అందజేస్తూ వారి వద్ద నుండి కోట్ల రూపాయల ఆస్తులను పోగు చేసుకున్నాడు.హోంగార్డుగా తనకున్న సుదీర్ఘ అనుభవాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడే ఉద్యోగులకు ముందస్తు సమాచారాన్ని చేరవేయడం ద్వారా డబ్బులు సంపాదించాడు.

అదే విధంగా జిల్లాలో ఉన్న సబ్ రిజిస్ట్రార్లకు అవసరమైన సమాచారాన్ని చేరవేస్తూ ప్రతి నెల వారి వద్ద నుంచి నెలవారీ మామూళ్లను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉండటంతో రెండేళ్ల క్రితం శ్రీనివాసరావును ఏసీబీ శాఖ నుంచి బదిలీ చేయడంతో ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖలు హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు హోమ్ గార్డ్ శ్రీనివాస్రావుపై ఆరోపణలు ఉండడంతో ఏసీబీ డిఎస్పి రమ్య నేతృత్వంలో ఏసీబీ అధికారులు గురువారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలో గల గోకపేటలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు ఇంటిపై మెరుపు దాడి చేశారు.
అదేవిధంగా శ్రీనివాసరావు స్వస్థలమైన గుర్ల మండలంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో శ్రీనివాసరావుకు సంబంధించి పలు రకాల కీలకమైన స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు పదికి పైగా జగనన్న ఇళ్ల పట్టాలతో పాటు ఇతర ఆస్తులకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీన పరుచుకున్నారు.
హోంగార్డ్ శ్రీనివాసరావుకు విజయనగరంలోనే కాకుండా విశాఖపట్నంలో కూడా కొన్ని ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. సుమారు 20 కోట్ల రూపాయలు మేరా హోంగార్డ్ శ్రీనివాసరావు అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు ప్రాథమిక సమాచారం. ఏసీబీ అధికారులు శ్రీనివాసన్ అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
