- అబ్బురపరిచిన ఎగ్జిబిట్స్
కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని సరస్వతి విద్యానికేతన్ హైస్కూల్లో సైన్స్ ఫెయిర్ అట్టహాసంగా జరిగింది. ఆదివారం ఎల్లమ్మగుడి సమీపంలో ఉన్న పాఠశాలలో కరెస్పాండెంట్ మార్త యుగంధర్ రావు, వైస్ ప్రిన్సిపాల్ మార్త లావణ్య ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు.
మొత్తం 195 ఎగ్జిబిట్స్ విద్యార్థులు ప్రదర్శించగా, అందులో ప్రత్యేక ఆకర్షణగా కాంతారా – మహాభారతం లోని ఘట్టాన్ని విద్యార్థులు అత్యద్భుతంగా ఆవిష్కరించి అందరి ప్రశంసలు పొందారు.
వైజ్ఞానిక–సాంస్కృతిక ఎగ్జిబిషన్‌లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను న్యాయనిర్ణేతలుగా హాజరైన వర్ధన్నపేట డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ రెడ్డప్ప, డాక్టర్ శ్రీనివాస్ పరిశీలించారు. ప్రతిభ కనబరిచిన ఉత్తమ ఎగ్జిబిట్లను ఎంపిక చేసి, విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మార్త యుగంధర్ రావు మాట్లాడుతూ.. విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ ఫెయిర్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడంలో కీలక పాత్ర పోషిస్తాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

