School | ఎమ్మెల్యే వినోద్‌కు ‘గజమాల’ స్వాగతం..

School | ఎమ్మెల్యే వినోద్‌కు ‘గజమాల’ స్వాగతం..
School | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి రాజకీయాల్లో అప్పుడే వేడి మొదలైంది. ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు అత్యంత సన్నిహితుడు, సీనియర్ నాయకుడు దావ రమేష్ బాబు ఈ రోజు పట్టణంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలకడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన నిమిత్తం పట్టణానికి వచ్చిన ఎమ్మెల్యే వినోద్‌ను దావ రమేష్ దంపతులు గజమాలతో సత్కరించారు.
మున్సిపల్ చైర్మన్ పీఠం ‘మహిళా జనరల్’ కు రిజర్వ్ కావడంతో, ఆశావహుల సంఖ్య అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో దావ రమేష్ తన భార్య దావ స్వాతితో కలిసి ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది. దావ స్వాతిని 7వ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేయించేందుకు రమేష్ బాబు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న సీనియర్ నేతగా, ఎమ్మెల్యేకు విధేయుడిగా ఉన్న రమేష్‌కు చైర్మన్ పీఠం విషయంలో ఎమ్మెల్యే ఆశీస్సులు ఉంటాయా అనే కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి.
చైర్మన్ పీఠంపై కన్ను..
మున్సిపాలిటీలో పట్టున్న నాయకుడిగా పేరున్న దావ రమేష్, తన భార్యను బరిలోకి దించడం ద్వారా చైర్మన్ రేసులో నిలవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే రాక సందర్భంగా నిర్వహించిన ఈ స్వాగత కార్యక్రమం, ఒక రకంగా తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంగా పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలించడంతో కొత్త రాజకీయ అధ్యాయానికి దావ రమేష్ కుటుంబం సిద్ధమవుతోందనే వార్త పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.
