School Bus | పసిప్రాణాలతో చెలగాటం..

School Bus | పసిప్రాణాలతో చెలగాటం..

School Bus, సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : పిల్లలను బడికి పంపేటప్పుడు తల్లిదండ్రులు దేవుడి చేతుల్లో పెట్టి పంపుతున్న పరిస్థితి ఇది. సురక్షితంగా వెళ్లి చదువుకుని వస్తారా? అన్న భయం ఇక ఊహ మాత్రమే కాదు… రోజువారీ వాస్తవంగా మారుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో పసిప్రాణాల భద్రత పై మరోసారి ఘోర నిర్లక్ష్యం బయటపడింది. ధర్మవరం సమీపంలోని సి.కె. పల్లి మండలం ఓంటికొండ వద్ద శనివారం ఉదయం వంశీకృష్ణ నోబెల్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటన హృదయాలను కలచివేసింది. ప్రతి రోజూ లాగానే బడికి వెళ్లేందుకు ఉత్సాహంగా ఎక్కిన చిన్నారులు ఒక్కసారిగా బస్సు బోల్తా పడటంతో ప్రాణభయంతో అరుపులు, కేకలతో వణికిపోయారు. బస్సులో చిక్కుకున్న పిల్లలు అమ్మా–నాన్నలని పిలుస్తూ కేకలు వేయడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం జరగకపోవడంతో పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ కొన్ని క్షణాలు ఆలస్యమై ఉంటే? అన్న ప్రశ్న ప్రతి తల్లిదండ్రి గుండెల్లో గుచ్చుకుంటోంది. సమాచారం అందుకున్న సీకె పల్లి ఎస్‌.ఐ సత్యనారాయణ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటన పై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఈ విచారణలు, ఫైళ్లు, రిపోర్టులు పిల్లల ప్రాణాలకు తిరిగి భద్రత ఇస్తాయా? అనే ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది.

ఈ ప్రమాదం రవాణా శాఖ పని తీరు పై తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తోంది. ఫిట్‌నెస్ లేని బస్సులు రోడ్ల పై ఎలా తిరుగుతున్నాయి? వేగ నియంత్రణ లేకుండా స్కూల్ బస్సులు దూసుకుపోతున్నా అధికారులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? అనుభవం లేని డ్రైవర్ల చేతుల్లో చిన్నారుల ప్రాణాలు ఎందుకు పెట్టాలి? అని తల్లిదండ్రులు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. స్థానిక గ్రామస్తులు మరో ఆందోళనకర విషయాన్ని వెల్లడించారు. ఇదే మార్గంలో రిషి విద్యాలయానికి చెందిన స్కూల్ బస్సు కూడా రోజూ అతివేగంతో వెళ్తోందని, పలుమార్లు పోలీసులకు చెప్పినా చర్యలు కనిపించలేదని వాపోయారు. “ప్రమాదం జరిగాకే అధికారులు కదులుతారా?” అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లాలో వరుసగా స్కూల్ బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఘటన తర్వాత “కఠిన చర్యలు తీసుకుంటాం” అన్న మాటలు వినిపిస్తున్నాయి తప్పా మార్పు మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లలను కాపాడాల్సిన వ్యవస్థే వారికి ముప్పుగా మారితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక ప్రమాదం ప్రాణాలు తీసిన తర్వాత అయినా రవాణా శాఖ మేల్కుంటుందా? లేక ఇంకెన్ని పసిప్రాణాలు బలైపోవాల్సి వస్తుంది? అన్న ప్రశ్నలు జిల్లా ప్రజల మనసులను కలిచివేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని స్కూల్ బస్సుల పై ప్రత్యేక తనిఖీలు, కఠిన చర్యలు తీసుకోకపోతే… “అదృష్టవశాత్తూ బతికిపోయారు” అనే మాట ఒక్కరోజు “అపశ్రుతి”గా మారే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు కన్నీటితో హెచ్చరిస్తున్నారు.

Leave a Reply