School | ముస్తాబు కొత్త పాఠం

School | ముస్తాబు కొత్త పాఠం

School | చిత్తూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమం పాఠశాలల వాతావరణం ఆహ్లాదకరంగా మార్చుతోంది. తరగతి గదిలో పుస్తకాలతో పాటు పరిశుభ్రత కూడా ఒక భాగంగా మారడంతో, బడులు ఇప్పుడు కేవలం విద్యాకేంద్రాలే కాకుండా మంచి అలవాట్లకు శిక్షణ కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని లాంచనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అనకాపల్లిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కీలకమైన అంశం ముస్తాబు కార్నర్. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లో ప్రతి తరగతి గదికి ఒక ముస్తాబు కార్నర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పెద్ద అద్దం, దువ్వెనలు, నెయిల్ కట్టర్లు, సబ్బులు, హ్యాండ్ వాష్ వంటి వస్తువులు అందుబాటులో ఉంటాయి. తరగతి గదిలోకి అడుగుపెట్టే ముందు విద్యార్థులు తమ జుట్టు సరిగా ఉందో లేదో, ముఖం శుభ్రంగా ఉందో లేదో చూసుకోవడం ఇప్పుడు రోజువారీ అలవాటుగా మారింది. చిన్నచిన్న చర్యలతోనే పెద్ద మార్పుకు ఇది నాంది పలుకుతోంది.

ముస్తాబు కార్యక్రమం అమలుతో విద్యార్థుల ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. శుభ్రంగా ముస్తాబై తరగతిలోకి వెళ్లడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ముఖ్యంగా వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. ఇంటి వాతావరణం దూరమైనా, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం లేకుండా చూసుకునే అలవాటు ఏర్పడుతోంది. ఇది చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతోంది. ఈ కార్యక్రమం కేవలం సూచనలకే పరిమితం కాకుండా, పర్యవేక్షణ వ్యవస్థతో ముందుకు సాగుతోంది.

తరగతి లీడర్లు, మానిటర్లు రోజూ తమ సహచరుల పరిశుభ్రతను గమనిస్తారు. జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలల సందర్శనల సమయంలో ముస్తాబు కార్నర్ల నిర్వహణను పరిశీలిస్తున్నారు. పరిశుభ్రతలో ఆదర్శంగా నిలిచే విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు, పాఠశాలలకు ప్రోత్సాహకాలు అందించాలనే విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. దీంతో పోటీ భావన పెరిగి, పరిశుభ్రత ఒక సామూహిక బాధ్యతగా మారుతోంది. ముస్తాబు కార్యక్రమం విజయవంతం కావడంలో తల్లిదండ్రుల కమిటీలు, దాతల సహకారం కీలకంగా మారింది. అనేక పాఠశాలల్లో అవసరమైన సామగ్రిని తల్లిదండ్రులే సమకూరుస్తున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాకుండా, సమాజ ఉద్యమంగా మారుతున్నదనే భావన కలుగుతోంది.

School

చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చురుగ్గా అమలవుతోంది. ఉదయం ప్రార్థనకు ముందు ముస్తాబు కార్నర్ వద్ద విద్యార్థుల సందడి కనిపిస్తోంది. పరిశుభ్రత అలవాట్లు చిన్నతనంలోనే అలవడితే జీవితాంతం కొనసాగుతాయనే భావనతో ఉపాధ్యాయులు కూడా దీనికి పూర్తి సహకారం అందిస్తున్నారు. ముస్తాబు కార్యక్రమం చదువుతో పాటు జీవన నైపుణ్యాలను నేర్పే ఒక వినూత్న ప్రయత్నంగా నిలుస్తోంది. పరిశుభ్రత, క్రమశిక్షణ, స్వీయ గౌరవం వంటి విలువలు పాఠ్యాంశాల కంటే ముందే జీవితానికి అవసరమని ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ చర్య, రాబోయే తరానికి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేసే దిశగా కీలక అడుగుగా భావించవచ్చు. మొత్తంగా, ముస్తాబు కార్యక్రమం అలంకరణ కాదు, అది అలవాటు. అలవాటు కాదు, అది సంస్కారం. సంస్కారం కాదు, అది భవిష్యత్తు నిర్మాణానికి పునాదిగా భావిస్తున్నారు.

ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని పలు పాఠశాలల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. ముస్తాబు కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు, విద్యార్థులకు పెద్ద అద్దం, దువ్వెన, పౌడర్, నెయిల్ కట్టర్, న్యాప్‌కిన్ వంటి వస్తువులను వేరువేరుగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ ఏర్పాట్లు తరగతి గదుల లోపల కాకుండా తరగతి గది బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

పాఠశాలకు వచ్చే విద్యార్థులు ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కొని, తల దువ్వుకుని, పరిశుభ్రంగా ముస్తాబై ఆపై తరగతి గదిలోకి ప్రవేశించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఇదే విధంగా ముస్తాబు కార్నర్లు ఏర్పాటు చేయాల్సిందిగా మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా ఉప విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని డీఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థినులు, విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లు పెరుగుతాయని, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం మెరుగుపడతాయని డీఈవో రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.

Leave a Reply