Saraswati Pushkaras | చదువుల తల్లి .. భక్తులు ప్రణమిల్లి

10వ రోజూ కొనసాగుతున్న సరస్వతీ పుష్కరాలు
కాళేశ్వరానికి బారులు తీరిన భక్తులు
త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు
నదీ తీరంలో పితృ తర్పణాలు
26 వ తేదీన ముగియనున్న పుష్కరాలు

భూపాల‌ప‌ల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు 10వ రోజుకు చేరుకున్నాయి. శ‌నివారం కూడా పవిత్ర స్నానాలు చేసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో కాళేశ్వరం త్రివేణి సంగమ తీరం భక్తులతో కిక్కిరిసిపోతోంది. వేకువ జాము నుంచి మొదలు రాత్రి వరకూ కూడా నదీ తీరం సరికొత్త శోభను సంతరించుకుంది. ఓ వైపున కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య స్నానాలు, మరో వైపున త్రివేణి సంగమానికి చీరె, సారె సమర్పించడం, నీటి పక్కన సైకత లింగాలకు పూజలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో కాళేశ్వరం అంతా ఆధ్యాత్మికత శోభ ఉట్టిపడుతోంది. నది తీరంలో పూర్వీకులను స్మరించుకుంటూ పితృ తర్పణాలు వ‌దులుతున్నారు. మే 15వ తేదీన ప్రారంభమైన సరస్వతి. పుష్కరాలు 26వ తేదీ సోమవారం నాటితో 12 రోజుల కార్యక్రమం ముగియనుంది.

కాశీ నుంచి పండితులు
ఇకపోతే సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరంలో అత్యంత హైలెట్ గా నిలుస్తోంది త్రివేణి సంగమంలో నిర్వహించే హారతి. హారతి నిర్వహించేందుకు కాశీ నుండి ప్రత్యేకంగా పండితులను తీసుకుని వచ్చారు. వీరు రోజు రాత్రి త్రివేణి సంగమ తీరాన నిర్వహిస్తున్న హారతి తంతు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే కాశీ గంగలో నీటి ప్రవాహంపై బోట్లలో కూర్చుని తిలకించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కాళేశ్వరంలో నది తీరం 3 నుండి 4 కిలో మీటర్ల మేర విస్తరించి ఉండడంతో నీటి ప్రవాహం మినహాయిస్తే మిగతా ప్రాంతమంతా కూడా ఇసుక మాత్రమే ఉంటుంది. దీంతో భక్తులు అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే త్రివేణి సంగమంలో ఉంటూ హారతిని వీక్షించే అవకాశం కల్పించారు.

సమాచార పౌర సంబంధాల శాఖ ప్రతి రోజు సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేని భక్తులు ఇంటి నుంచి లైవ్ చూడ‌వ‌చ్చు. కలెక్టర్ రాహుల్ శర్మ ప్రతి రోజు హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మూడు రోజులుగా వర్షం కురుస్తున్నా హారతి కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. రోజు రాత్రి 45 నిమిషాలకు పైగా నిర్వహించే హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకే పెద్ద ఎత్తున భక్తులు కాళేశ్వరంలో ఉండిపోతున్నారు. హారతి అనంతరం స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారంటే హారతి కార్యక్రమానికి ఎంతో ఆదరణ లభిస్తోంది.

ఇకపోతే రోజు కాళేశ్వరం త్రివేణి సంగమంలో నిర్వహించే హారతి కార్యక్రమంతో పాటు శుక్రవారం శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి సన్నిధిలో కాశీ పండితులు హారతి కార్యక్రమం నిర్వహించారు. గర్భాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంతో కాళేశ్వరం ఆలయ ప్రాంగణమంతా హర హర మహాదేవ‌ శంభోశంకర అంటూ నినాదాలతో మారు మోగింది. కలెక్టర్ రాహుల్ శర్మ సంగమంలో పడవలో ప్రయాణించి రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు. భారీ కేడింగ్ దాటి భక్తులు సంగమంలోకి రాకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply