పట్టణాభివృద్ధి పై మంత్రి నారాయణతో ఎమ్మెల్యే భేటీ…

పట్టణాభివృద్ధి పై మంత్రి నారాయణతో ఎమ్మెల్యే భేటీ…

నరసరావుపేట, ఆంధ్రప్రభ : నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మునిసిపల్ శాఖ మంత్రి పొంగురు నారాయణను నెల్లూరులో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నరసరావుపేట పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, అలాగే ప్రజలకు అత్యవసరంగా అవసరమైన వసతుల పై విస్తృతంగా చర్చించారు. ప్రత్యేకంగా పట్టణంలో రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సరఫరా విస్తరణ, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు.

అదే విధంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన నిధుల మంజూరు చేయాలని ఎమ్మెల్యే చదలవాడ విజ్ఞప్తి చేశారు. నరసరావుపేటను ఆధునిక పట్టణంగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే దిశగా ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని కోరారు.

ఎమ్మెల్యే డా౹౹చదలవాడ ప్రతిపాదనల పై మంత్రి నారాయణ సానుకూలంగా స్పందిస్తూ, నరసరావుపేట అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. అవసరమైన పనుల ప్రాధాన్యతనిస్తూ త్వరలోనే చర్యలు చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు._

Leave a Reply