Sammakka | గద్దెనెక్కిన వరాల తల్లి సమ్మక్క

Sammakka | గద్దెనెక్కిన వరాల తల్లి సమ్మక్క
- ఉత్తర దిశ చింతగట్టు నుంచి గద్దెకు చేరుకున్న వరాల తల్లి
- గురువారం రాత్రి ఆవిష్కృతమైన అపూర్వ ఘట్టం
- దారిపొడవునా నీరాజనాలు, ముగ్గులు, నీళ్లారబోతలు
- దాదాపు లక్షకు పైగా తరలివచ్చిన భక్తులు
Sammakka | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : ఇప్పగూడెం చింతగట్టు మినీ సమ్మక్క సారక్క జాతరలో కీలక ఘట్టం గురువారం రాత్రి వైభవంగా ఆవిష్కృతమైంది. వేలాది భక్తుల ఎదురు చూపులకు తెరదించుతూ వరాల తల్లి సమ్మక్క ఉత్తర దిశలోని చింత గట్టు నుంచి గద్దెపై కొలువుదీరింది. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరాగా, దారిపొడవునా నీరాజనాలు, నీళ్లారబోతలతో అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. తల్లిని దర్శిం చుకోవాలనే తపనతో గద్దెల వద్దకు భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు.

స్టేషన్ ఘన్‌పూర్ సీఐ జి. వేణు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ పోలీస్ బందోబస్తు మధ్య జాతర ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా భద్రతా విధుల్లో భాగంగా యువతను ఉద్దేశించి సీఐ వేణు జై సమ్మక్క అంటూ నినాదం చేయించి ప్రోత్సహించడం అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది. భక్తి భావంతో పాటు క్రమశిక్షణను చాటిన ఈ దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతర చైర్మన్ తోట వెంకన్న, వైస్ చైర్మన్ మ్యాదారవేన కర్ణాకర్, కమిటీ సభ్యుల సమక్షంలో ప్రధాన పూజారులు వెంకటేశ్వర్లు, సమ్మక్క, కుంట మల్లేష్, లింగనబోయిన మల్లయ్య అమ్మవారిని గద్దెకు చేర్చారు.

అమ్మవారు గద్దెనెక్కిన క్షణంలో అప్పటిదాకా ఊపిరి బిగబట్టిన జనా రణ్యంలో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అమ్మ వచ్చె…సమ్మక్క వచ్చె…అంటూ భక్తులు తన్మయత్వంలో నినదించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటం తో భద్రతా కారణాల రీత్యా కొంతసేపు దర్శనాలను నిలిపివేసి, పూజా కార్యక్రమాలు పూర్తైన అనంతరం మళ్లీ దర్శనాలకు అనుమతించారు. జాతర ముగింపు సందర్భంగా ఎల్లుండి సాయంత్రం దేవతల వన ప్రవేశంతో చింతగట్టు మినీ సమ్మక్కసారక్క జాతర అధికారికంగా ముగినుంది. ఈ కార్యక్రమంలో సర్పంచులు మందపురం రాణి అనిల్, జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, పనికర సోమయ్య, మాజీ జాతర చైర్మన్ మందపురం ఎల్లగౌడ్, ఉప సర్పంచ్ లింగనబోయిన రాజు, నాయకు లు నెలమంచ అజయ్ రెడ్డి, మునిగేల రమేష్, లింగన బోయిన శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

- శబాష్ పోలీస్…

భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చినప్పటికీ ఎలాంటి అపశృతి జరగ కుండా, ట్రాఫిక్ నియంత్రణ, గద్దెల వద్ద కట్టుదిట్టమైన భద్రత, భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వహణలో స్టేషన్ ఘన్‌పూర్ పోలీస్ యంత్రాం గం ప్రశంసనీయమైన పాత్ర పోషించింది. సీఐ జి. వేణు ఆధ్వర్యంలో ఎస్ఐలు వినయ్, రాజేష్ తో పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతంగా సాగించారు.


