KNR | దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణలో పాలన… మంత్రి శ్రీధర్ బాబు
పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 17(ఆంధ్రప్రభ) : దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి పట్టణం స్వరూప గార్డన్ లో నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఏడాది కాలంలో 57వేల ఉద్యోగ నియామకాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు. నిరుద్యోగ, యువతకు నైపుణ్యం పెంచేందుకు హైదారాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
317 జీఓను వెసులుబాటును బట్టి ఉపాధ్యాయులకు సొంత జిల్లాల్లో పనిచేసే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టామని గుర్తు చేశారు. కులగణన దేశానికి దిక్సూచిగా నిలిచిందని, ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు మాట్లాడే తీరు సరిగాలేదని, చేతనైతే రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మించితీరుతామని, అపోహలొద్దని హామీ ఇచ్చారు. ఈనెల 27 జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు. సమావేశంలో విప్ అడ్లూరి లక్ష్మన్ కుమార్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మాక్కాన్ సింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.