RTC Bus Stand | పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి

RTC Bus Stand | పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
- ఆర్టీసీ బస్టాండ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
- డార్మెటరీ, టాయిలెట్ల నిర్వహణ మెరుగుపర్చాలి
- గడువు ముగిసిన వస్తువులు, ఎమ్మార్పీ మించి విక్రయిస్తే కఠిన చర్యలు
- కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశాలు
RTC Bus Stand | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆర్టీసీ బస్టాండ్ (RTC Bus Stand) పరిసరాలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా ఉంచాలని, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సౌకర్యాల నిర్వహణ పటిష్టంగా ఉండాలని కలెక్టర్ డా.ఏ.సిరి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బుధవారం కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ కౌంటర్, టాయిలెట్లు, డార్మిటరీ, ఉచిత తాగునీటి కేంద్రం, షాపులు, హోటళ్లు, నిఘా, భద్రత విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. బస్టాండ్ ఎంట్రన్స్ ప్రాంగణంలో పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నట్లు గమనించిన కలెక్టర్, ప్రమాదాలు జరుగకముందే తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించారు.

టాయిలెట్ల పరిశీలనలో నిర్వహణ బాగున్నప్పటికీ మరింత మెరుగుపర్చాలని సూచించారు. టాయిలెట్ (Toilet) ఎంట్రన్స్ వద్ద డోర్లు ఏర్పాటు చేయడంతో పాటు పెయింటింగ్ వేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర డార్మిటరీ నిర్వహణపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, శుభ్రత కాపాడాలని, ప్రయాణికులతో గౌరవంగా మాట్లాడాలని సిబ్బందికి సూచించారు.

తాగునీటి కేంద్రాన్ని పరిశీలించారు. నీటిని (Water) స్వయంగా తాగి చూశారు. ఆ ప్రాంతంలో వాసన రావడంపై సీరియస్ అయ్యారు. అనంతరం బస్టాండ్ పరిసరాల్లోని షాపులు, హోటళ్లను తనిఖీ చేశారు. గడువు ముగిసిన వస్తువులు విక్రయించినా, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోటల్లో అల్పాహారం చేస్తున్న ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

స్త్రీ శక్తి పథకంపై ప్రయాణికుల ప్రశంసలు
కర్నూలు–నంద్యాల సర్వీస్ బస్సులో ప్రయాణికులతో మాట్లాడిన కలెక్టర్ (Collector) స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు కలుగుతున్న లబ్ధిపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా మంచి ప్రయోజనం చేకూరుతోందని, బస్టాండ్ సౌకర్యాలు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రయాణికులు తెలిపారు. ఆయన వెంట ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



