ఆర్టీసీ బస్సు–బైక్ ఢీ

ఆర్టీసీ బస్సు–బైక్ ఢీ
యువకుడికి తీవ్రగాయాలు
భూపాలపల్లి రూరల్, ఫిబ్రవరి 19 (ఆంధ్రప్రభ): పట్టణంలోని హెచ్‌పి పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు–బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. భూపాలపల్లి హనుమాన్ నగర్‌కు చెందిన పారునందుల సురేష్ టి ఎస్ 25జి 3459 నంబర్ గల ద్విచక్రవాహనంపై జయశంకర్ కూడలి నుంచి మంజునగర్ వైపు వెళ్తుండగా, అదే సమయంలో టిజీ 24 జెడ్ 0017 నంబర్ గల నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నర్సంపేట నుంచి కాలేశ్వరం వైపు ప్రయాణిస్తుండగా బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేష్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి ఆయనను భూపాలపల్లిలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వన్‌వే ట్రాఫిక్ కారణంగానే ప్రమాదమా?
ఇదిలా ఉండగా, ప్రమాదానికి ప్రధాన కారణం వన్‌వే ట్రాఫిక్ అమలేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ఫైవ్ ఇంక్లైన్ ఆర్చ్ సమీపంలో ఉన్న సింగరేణి ఫిల్టర్ బెడ్‌కు సంబంధించిన పైప్‌లైన్ లీకేజీ కారణంగా హైవేపై పెద్ద గుంత తవ్వి సింగరేణి సివిల్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. దీంతో గత ఆరు రోజులుగా ఫైవ్ ఇంక్లైన్ ఆర్చ్ నుంచి హెచ్‌పి పెట్రోల్ బంక్ వరకు వన్‌వే ట్రాఫిక్ అమల్లో ఉంది. ఈ మార్పుల వల్లే ప్రమాదం చోటుచేసుకుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు పూర్తి చేసి, ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకురావాలని, ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

