కాగ్ నివేదికతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి…

కాగ్ నివేదికతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి…
రాష్ట్రాన్ని అప్పుల ఓబుల్లోకి నెట్టదు..
కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
విజయవాడ, ఆంధ్రప్రభ : కాగ్ నివేదికలో పేర్కొన్న అంశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ నరరెడ్డి తులసి రెడ్డి సూచించారు. శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టారని ఆయన గుర్తుచేశారు. ఆ నివేదికలో రాష్ట్రానికి ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని, భవిష్యత్ ఆర్థిక స్థిరత్వంపై ఆందోళన వ్యక్తమైందని పేర్కొన్నారు.
రాష్ట్రం భవిష్యత్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని కాగ్ హెచ్చరించిందన్నారు.2024–25 బడ్జెట్‌లో రూ.68,743 కోట్ల అప్పు ఉంటుందని అంచనా వేయగా, చివరకు రూ.81,071 కోట్ల అప్పు తీసుకున్నారని వివరించారు. అంటే అంచనాల కంటే 16 శాతం అధికంగా అప్పులు పెరిగాయని చెప్పారు. ఇవి ప్రత్యక్ష అప్పులు మాత్రమేనని, పరోక్ష అప్పులు అదనంగా ఉన్నాయని తెలిపారు. బడ్జెట్‌లో రూ.32,717 కోట్ల మూలధన వ్యయం అంచనా వేయగా, చివరకు రూ.16,141 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపారు.
అంటే అంచనాల కంటే సుమారు 50 శాతం తక్కువగా వ్యయం జరిగిందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024–25లో మూలధన వ్యయం 12 శాతం తగ్గిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.30,333 కోట్లు గ్రాంట్ రూపంలో వస్తాయని అంచనా వేయగా, చివరకు రూ.20,188 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. అంటే అంచనాల కంటే రూ.10,145 కోట్లు తక్కువగా వచ్చాయని చెప్పారు. ఇదేనా “డబుల్ ఇంజిన్” పాలన అని ప్రశ్నించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 365 రోజుల్లో 357 రోజులు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద తాత్కాలిక అప్పులు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన విమర్శించారు. మొత్తం రూ.1,72,532 కోట్ల వరకు అప్పు తీసుకున్నారని, దానికి రూ.303 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చిందని వివరించారు.
భారత సార్వభౌమత్వాన్ని కాపాడాలి
భారతదేశ సార్వభౌమత్వం కోసం స్వాతంత్ర సమరయోధులు పోరాడారని గుర్తుచేసిన తులసిరెడ్డి, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం విదేశీ ఒత్తిడులకు లోనవుతున్నదని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు భారత్ ఇంధన కొనుగోళ్లపై ప్రభావం పడుతోందని వ్యాఖ్యానించారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని కేంద్రాన్ని కోరారు.
ప్రత్యేక అధికారుల నియామకం రాజ్యాంగ విరుద్ధం..
మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించడం రాజ్యాంగ విరుద్ధమని తులసిరెడ్డి విమర్శించారు. 73వ, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు కాలపరిమితి ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఎన్నికలు జరపకపోతే కేంద్ర గ్రాంట్లు కూడా నిలిచిపోతాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూర్బన్ గ్రామపంచాయతీల విధానంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.
ఇప్పటికే ఉన్న మునిసిపాలిటీలలో మౌలిక వసతులు సరిగా లేకపోయినా, కొత్తగా రూర్బన్ పంచాయతీలకు హామీలు ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు. ఈ ప్రక్రియలో గ్రామాల్లో అమలవుతున్న ఉపాధి హామీ పథకాన్ని నిలిపివేయాలనే కుట్ర ఉందని ఆరోపించారు. రూర్బన్ పంచాయతీలలో కూడా ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలను కొండ శివాజీ, ఏఐసీసీ మాజీ సభ్యుడు బషీర్ అహ్మద్, కాంగ్రెస్ రైతు నాయకుడు కొమ్మినేని సురేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నామా వినయ్ తదితరులు పాల్గొన్నారు.
