Rs.80 lakhs | షాపింగ్ కాంప్లెక్స్‌లు, గెస్ట్ హౌస్…

Rs.80 lakhs | షాపింగ్ కాంప్లెక్స్‌లు, గెస్ట్ హౌస్…
Rs. 80 lakhs | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లా ప్రజా పరిషత్ చిత్తూరు ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జడ్‌పీ జనరల్ ఫండ్ మిగులు నిధులతో పలు అభివృద్ధి పనులకు పరిపాలనా, ఆర్థిక అనుమతులు మంజూరు చేస్తూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వి. రవికుమార్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా ప్రతినిధులు, గ్రామస్తుల అభ్యర్థనల మేరకు సంబంధిత మండలాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ పనులను ఆమోదించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పీఆర్‌ఐ సబ్ డివిజన్ల నుండి అందిన లైన్ ఎస్టిమేట్లు, జెడ్పీ చైర్మన్ ఆమోదంతో ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
మంజూరైన పనులలో ప్రధానంగా ఇరాల మండలం కనిపాకం జెడ్పీ హైస్కూల్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.25 లక్షలు, పలమనేరు మండలం పలమనేరు వద్ద జెడ్పీ గెస్ట్ హౌస్ కూల్చివేతకు రూ.5 లక్షలు, అదే ప్రాంతంలో కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.25 లక్షలు, వి.కోట మండలంలోని జెడ్పీ హైస్కూల్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేశారు. మొత్తం రూ.80 లక్షల విలువైన ఈ అభివృద్ధి పనులను పీఆర్‌ఐ విభాగం, చిత్తూరు ద్వారా అమలు చేయాలని స్పష్టంగా ఆదేశించారు.

ఈ పనులను తక్షణమే ప్రారంభించి, నిబంధనలు, సాంకేతిక మార్గదర్శకాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పీఆర్‌ఐ డివిజన్ చిత్తూరుకు సూచించారు. పనులు అప్పగింత ప్రక్రియను నామినేషన్ పద్ధతిలో అయితే ఒక వారంలో, టెండర్ పద్ధతిలో అయితే 15 రోజుల్లో పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ.5 లక్షల లోపు పనులను హాబిటేషన్ వర్క్స్ కమిటీ ద్వారా నామినేషన్ పద్ధతిలో, రూ.5 లక్షలకు పైబడిన పనులను టెండర్ విధానంలో అప్పగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
సాంకేతిక అనుమతుల విషయంలో డీఈఈ రూ.5 లక్షల వరకు, ఈఈ రూ.40 లక్షల వరకు, ఎస్ఈ రూ.2 కోట్లు వరకు మరియు సీఈ రూ.2 కోట్లకు పైబడిన పనులకు అనుమతులు ఇవ్వగల అధికార పరిధి ఉందని పేర్కొన్నారు. పనులు ప్రారంభానికి ముందే వివరమైన అంచనాలు, సాంకేతిక అనుమతులు సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల నుండి పొందాలని ఎంపీడీవోలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
పనులు అప్పగింత అనంతరం ఒక వారంలో గ్రౌండింగ్ చేసి, గరిష్టంగా 60 రోజులలోపు పూర్తి చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. పనుల రికార్డింగ్, చెక్ మెజర్‌మెంట్ ప్రక్రియలను ప్రతి పనికి వేర్వేరు ఎం.బుక్‌లో నమోదు చేయాలని, సంబంధిత శాఖ ఇంజనీర్లు దశలవారీగా తనిఖీలు చేయాలని సూచించారు. రూ.5 లక్షల లోపు పనులను డిప్యూటీ ఈఈ స్థాయిలో, రూ.5 లక్షల నుండి రూ.2 లక్షల వరకు పనులను ఈఈ స్థాయిలో తనిఖీ చేయాల్సి ఉండగా, రూ.5 లక్షలకు పైబడిన అంచనా ఉన్న పనులను కనీసం 30 శాతం విలువ వరకు ఈఈ తనిఖీ చేయాల్సి ఉంటుంది.
నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా క్వాలిటీ కంట్రోల్ విభాగం ద్వారా ప్రతి దశలో తనిఖీలు నిర్వహించి, తుది చెల్లింపులకు ముందు నాణ్యత ధృవీకరణ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. అవసరమైతే పీఆర్ శాఖ క్వాలిటీ కంట్రోల్ సిబ్బందిని వినియోగించి, అంచనా వ్యయంపై 0.50 శాతం చెల్లించి నాణ్యత తనిఖీలు నిర్వహించవచ్చని సూచించారు.
గ్రాంట్ల విడుదల ప్రక్రియలో భాగంగా పనులు పూర్తయిన తరువాత మాత్రమే బిల్లులు, ఎం.బుక్స్, ఫోటోలు సమర్పణపై సంబంధిత బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేయబడతాయని స్పష్టం చేశారు. పనులకు ఎలాంటి అడ్వాన్స్ చెల్లింపులు ఉండవని, ఇతర పథకాల పనులకు ఈ గ్రాంట్లను మళ్లించరాదని కఠినంగా హెచ్చరించారు. ఎంపీడీవోలు, ఈఈలు పనుల మూడు దశల్లో — పనులు ప్రారంభానికి ముందు, అమలు సమయంలో, పూర్తి అనంతరం — ఫోటోలు తీసి జెడ్పీకి సమర్పించాల్సి ఉంటుంది.
అదేవిధంగా మండల, గ్రామ పంచాయతీ, డివిజనల్ స్థాయిలలో ఆస్తుల రిజిస్టర్ నిర్వహణ, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమయానికి సమర్పణ, ప్రతి నెల 3వ తేదీకి పురోగతి నివేదికలను సీఈఓ, జెడ్‌పీపీ చిత్తూరుకు పంపించాలని ఆదేశించారు. పనుల వివరాలు, మండలం పేరు, పనిపేరు, అంచనా వ్యయం, వర్క్ ఆర్డర్ తేదీలు, ఎం.బుక్ నంబర్, మొత్తం వ్యయం వంటి సమగ్ర వివరాలను ప్రత్యేక షీట్‌లో నమోదు చేసి సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడే ఈ పనులు వేగంగా పూర్తి అయితే స్థానిక ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పాఠశాలలు, ప్రజా అవసరాల కోసం వాణిజ్య సదుపాయాలు ఏర్పడి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జెడ్పీ తీసుకున్న ఈ నిర్ణయం అభివృద్ధి దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
click here to read more : Assembly | బీసీ కాంపోనెంట్ కు రూ. 51,021 కోట్లు
