అత్యాధునిక పోలీస్ స్టేషన్ల నిర్మాణం…

అత్యాధునిక పోలీస్ స్టేషన్ల నిర్మాణం…
- శాంతిభద్రతలకు కట్టుదిట్టమైన చర్యలు: విప్ యార్లగడ్డ వెంకట్రావు…
గన్నవరం, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, ప్రజల భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం గన్నవరం ఎయిర్పోర్ట్లో గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్, గన్నవరం సీఐ శివ ప్రసాద్, హనుమాన్ జంక్షన్ సీఐ ఎల్. రమేష్, ఆత్కూరు ఎస్ఐ లక్ష్మీ నరసింహమూర్తితో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే శాంతిభద్రతల పరిస్థితిని సమగ్రంగా సమీక్షించి, పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న గన్నవరం పోలీస్ స్టేషన్ను రూ.3 కోట్ల వ్యయంతో అన్ని ఆధునిక సదుపాయాలతో కూడిన G+3 భవనంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. తన హయాంలోనే ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. ఈ నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వంపై భారం లేకుండా CSR నిధులు మరియు ఎన్నారై (NRI)ల సహకారంతో సమీకరించి, త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ఇందుకోసం రూపొందించిన నిర్మాణ ప్రణాళికను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. విజయవాడ రూరల్ పరిధిలోని 9 గ్రామాల ప్రజల సౌకర్యార్థం రామవరప్పాడులో నూతన పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్థల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో స్థానిక ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తొలగి, పోలీస్ సేవలు మరింత వేగంగా, సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే, ఆత్కూరులో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను త్వరలో హోమ్ మంత్రి అనితతో కలిసి ప్రారంభించనున్నట్లు తెలిపారు.
