లబ్దిదారుల ముంగిటకే ఎన్టీఆర్ భరోసా…

లబ్దిదారుల ముంగిటకే ఎన్టీఆర్ భరోసా…
జిల్లాలో రూ.104.18 కోట్ల పెన్షన్ల పంపిణీ.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : లబ్దిదారుల ముంగిటకే వెళ్లి ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్లను అందజేస్తూ ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రజలకు చేరవేస్తోందని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ఏప్రిల్ మాసానికి సంబంధించి జిల్లాలో అర్హులైన 2,35,692 మంది లబ్దిదారులకు మొత్తం రూ.104.18 కోట్ల పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం గోనెగండ్ల మండలం కైరవాడి గ్రామంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు.
అయ్యమ్మకు వృద్ధాప్య పెన్షన్, నాగలక్ష్మి, రంగమ్మలకు వితంతువు పెన్షన్లు, బోయ చిన్న సోమన్న, శ్రీ నిత్య, రహేలమ్మలకు వైకల్య పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో కలెక్టర్ ఆత్మీయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ, ఇంటి పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సభ్యుల సహకారం వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

ప్రతి నెలా పెన్షన్ సమయానికి అందుతోందా అనే విషయాన్ని కూడా ఆరా తీశారు. నాగలక్ష్మికి వితంతువు పెన్షన్ అందజేస్తూ, కేవలం వ్యవసాయం మీదే ఆధారపడకుండా పాడి పశువులను పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు రావాలని లబ్దిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణారెడ్డి, గోనెగండ్ల తహసిల్దార్ రాజేశ్వరి, ఎంపిడిఓ మణి మంజరి తదితరులు పాల్గొన్నారు.
